నీ కూతురి చేయి ఎప్పుడు వదులుతావు?

Aishwarya Rai Holds Aaradhyas Hands As She Returns To Mumbai - Sakshi

ఐశ్వర్యరాయ్‌కు ఆరాధ్య ఒక్కతే కూతురు ప్రస్తుతానికి. ఐశ్వర్యరాయ్‌కు ఆరాధ్యే కూతురు. ఐశ్వర్యారాయ్‌ ఆరాధ్యను అనుక్షణం తన కూతురు అనుకుంటూ ఉంటుంది. ఏమిటి.. చెప్పిందే చెప్తున్నాం అనుకుంటున్నారా? ఐశ్వర్యరాయ్‌ బయట ఎక్కడ కనిపించినా కూతురి చేయి పట్టుకోకుండా కనిపించదు. లేదా కూతురి చేతిని వదలకుండా పట్టుకుని ఉంటుంది. దీని మీద ఎవరు ఎన్ని విమర్శలు చేసినా తాజాగా ముంబై ఎయిర్‌పోర్టులో కూడా కూతురి చేతిని పట్టుకునే కనిపించింది. ‘నీ కూతురి చేతిని నువ్వెప్పుడు వదిలిపెడతావ్‌?’ అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఏం జరిగిందంటే మణిరత్నం సినిమా కోసం గత మూడు నాలుగు వారాలుగా ఐశ్వర్యా రాయ్‌ తన భర్త, కూతురుతో చెన్నైలో ఉంది. షూటింగ్‌ పని అయ్యాక రెండు రోజుల క్రితం ముంబై ఎయిర్‌పోర్ట్‌ చేరుకుంది. బయటికొచ్చే సమయంలో యధావిధిగా కూతురి చేతిని పట్టుకుని ఉంది.

ఎయిర్‌పోర్టులో నుంచి బయటకు వచ్చి కారు ఎక్కే వరకు ఆరాధ్య చేతిని ఆమె వదల్లేదు. వారిద్దరి వెనుక అభిషేక్‌ బచ్చన్‌ నడుస్తూ కనిపించాడు. ఆరాధ్యకు ఇప్పుడు 9 ఏళ్లు. తొమ్మిదేళ్ల అమ్మాయి తనకు తానుగా ఆడొచ్చు. పరిగెత్తుకుంటూ వచ్చి కార్‌ ఎక్కవచ్చు. లేదా అటూ ఇటూ దిక్కులు చూస్తూ నడవొచ్చు. కాని ఐశ్వర్య ఇవేమి అలౌ చేయదు. కూతురి చేయి తన చేతిలో ఉండాల్సిందే. ఇప్పుడే కాదు. ఆరాధ్య తో ఆమె ఎప్పుడు బయటకు వచ్చినా, ఆరాధ్య స్కూల్‌కు ఆరాధ్యతో వెళ్లినా ఐశ్వర్య తన కూతురి చేతిని విడువదు. దీనిపై నెటిజన్లు కామెంట్లు చేస్తూ వస్తున్నారు. ‘ఐశ్వర్య చాలా పొసెసివ్‌’ అని ఒకరంటే ‘ఐశ్వర్య చాలా ప్రొటెక్టివ్‌’ అని ఒకరన్నారు. ‘అయ్యో... ఆ అమ్మాయి చేయి వదలొచ్చు కదా’ అని ఒకరంటే ‘కూతురికి ఎన్నేళ్లు వస్తే ఆమె చేయి వదులుతుందో’ అని మరొకరన్నారు. పిల్లల పెంపకంలో చేయి పట్టుకుని నడిపించడం ఉంటుంది.. చేయి వదిలి నేర్పించడం ఉంటుంది... ఐశ్వర్య ఈ దారిని ఎందుకు ఎంచుకుందో అనేవారు ఉంటారు. 

మరోవైపు ఆరాధ్య ఎప్పుడు బయటకు వచ్చినా పాపరాజిలు తమ కెమెరాలతో వెంటబడుతుంటారు. ఆమె చేయి వదిలితే వారు పలకరిస్తే ఏం మాట బయటకు వస్తుందో అదెక్కడికి దారి తీస్తుందోనని ఆమె అనుకుంటూ ఉండొచ్చా? లేదా భద్రత రీత్యా పాప చేయి వదలదా? ఏమో. కాని ఆమెలా అనునిత్యం పిల్లల చేయి పట్టుకుని కనిపించే బాలీవుడ్‌ సెలబ్రిటీలు లేరు.  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top