తల్లిదండ్రులతో జీవ్యాన్ రెడ్డి...
సాధారణంగా ఏడేళ్ల వయసున్న పిల్లలు అప్పుడప్పుడే కూడికలు, తీసివేతలను నేర్చుకుంటూ ఉంటారు. కానీ శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఏడేళ్ల చిన్నారి కట్టా ధ్రువ జీవ్యాన్ రెడ్డి లండన్ వేదికగా 16 ఏళ్ల వయస్సు విద్యార్థులు హాజరయ్యే మ్యాథ్స్ పరీక్షలో 8వ గ్రేడ్ సాధించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు.
జీవ్యాన్ రెడ్డి స్వస్థలం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా. ధ్రువకుమార్‌రెడ్డి, ఐశ్వర్యాదేవి జీవ్యాన్ రెడ్డి తల్లిదండ్రులు. వీరు ఉద్యోగరీత్యా గత ఐదేళ్లుగా లండన్‌లో నివాసముంటున్నారు. జీవ్యాన్ కు నర్సరీకి వెళ్లక ముందే సంఖ్యలు, కూడికలు, తీసివేతలపై ఆసక్తి ఉండేది. ఫస్ట్‌క్లాస్ చదువుతున్న సమయంలోనే సెకండరీ ఎడ్యుకేషన్ స్థాయి మ్యాథ్స్ పుస్తకాలలోని లెక్కలను పరిష్కరించేవాడు. అలా బ్రిటన్‌లో గత మే నెలలో నిర్వహించిన పియర్సన్ ఎడెక్సెల్ జనరల్ సర్టిఫికెట్ ఇన్ సెకండరీ ఎడ్యుకేషన్ (జీసీఎస్‌ఈ) హయ్యర్ మ్యాథమేటిక్స్ పరీక్షకు హాజరైన జీవ్యాన్ 8 వ గ్రేడ్ సాధించాడు. 240 మార్కులకు గాను 196 మార్కులను సాధించి అందరినీ అబ్బురపరిచాడు.
‘ఏ’ లెవెల్ టెస్ట్‌కు సన్నద్ధం...
జీసీఎస్‌ఈలో 8వ గ్రేడ్ సాధించడం ఎంతో ఆనందంగా ఉందనీ.. కష్టమైన లెక్కలకు భిన్న పద్ధతుల్లో సమాధానాల్ని కనుగొనడం అంటే తనకు ఆసక్తి అని చెబుతున్నాడు జీవ్యాన్. వచ్చే ఏడాది ఏ–లెవల్ టెస్ట్ కోసం సన్నద్ధమవుతున్నట్టు చెప్పాడు. ప్రజలకు ఉపయోగపడే రోబోలను ఆవిష్కరించడమే తన లక్ష్యమని అంటున్నాడు ఈ బాల మేధావి. జీవ్యాన్‌తో పరీక్షలు రాయించి రికార్డులు సృష్టించడం తమ లక్ష్యం కాదనీ.. సరైన దిశలో సాగేలా ప్రోత్సహించడమే తమ ధ్యేయమని అతని తల్లిదండ్రులు ధ్రువ కుమార్ రెడ్డి, ఐశ్వర్యాదేవి అంటున్నారు.
జీవ్యాన్ గణితంలోనే కాకుండా పలు చెస్ పోటీలలోనూ తన ప్రతిభను నిరూపించుకున్నాడు. ఏడేళ్ల పిన్నవయసులోనే అంతర్జాతీయ వేదికపై తెలుగువారి ఖ్యాతిని చాటిచెప్పిన జీవ్యాన్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
– మూలే యోగానంద రెడ్డి,సాక్షి, నెల్లూరు (టౌన్)


