
‘వంక’లు లేవు వాగులు లేవు... చెప్పడానికి సాకులు లేవు. వేసవి సెలవులు వచ్చేశాయి. సోషల్ మీడియా బందీఖానా నుంచి పిల్లలను ఇప్పుడు రిలీజ్ చేయాలి. పుస్తకాలకు దగ్గరగా తీసుకురావాలి. విక్రమార్కుడి సింహాసనం ఎక్కిస్తే కథల దర్బారులోకి వారే ప్రవేశిస్తారు. వేసవి సెలవుల్లో ఉన్న 50 రోజుల్లో పిల్లలు పుస్తకాలు ఎందుకు చదవాలి, ఏవి చదవాలి? వేసవి శీర్షిక ‘వేసవి కాలమ్’లో మొదటి కథనం.
పిల్లలకు బడి గంట ఇష్టమే. కాని స్కూల్ మొదలయ్యేప్పుడు కొట్టే గంట కంటే స్కూల్ వదిలేప్పుడు కొట్టే గంట ఎక్కువ ఇష్టం. ఆ గంట వినపడగానే పుస్తకాలు తీసుకుని క్లాస్ నుంచి పరిగెత్తుతారు. కొందరు ప్లేగ్రౌండ్‌కు వెళతారు. కొందరు ఇంటికి చేరి వెంటనే చుట్టుపక్కల ఫ్రెండ్స్‌ను పోగేస్తారు. ఎందుకు? ఇంకెందుకు... ఆటలు ఆడటానికి.
ఇంట్లో నుంచి అమ్మ పిలుస్తున్నా... ఏదైనా తిని వెళ్లమని అరుస్తున్నా పిల్లలు లెక్క చేయరు. ఆడుతుంటారు. ఆడుతూ అరుస్తూ ఉంటారు. నవ్వుతూ ఉంటారు. పేచీ పెడుతూ ఉంటారు. ఓడుతూ ఉంటారు. గెలుస్తూ ఉంటారు. ఇవన్నీ చేస్తూ చెమట చిందిస్తూ ఉంటారు.
పిల్లలూ చెమటా కవలలు
నేడు... పిల్లలకు చెమటే లేదు. ఎందుకు? ఎందుకంటే వాళ్లు ఆడటం లేదు కాబట్టి. ఆడే బదులు ఓ.టి.టి.లో, కంప్యూటర్లో, సోషల్ మీడియానో తమ బాల్యంతో ఆటలాడుకోవడానికి వీలు కల్పిస్తున్నారు కాబట్టి.
దొంగ... పోలీస్
‘దొంగ పోలీస్’ ఆట అందరికీ తెలుసు. ఇవాళ దొంగ పోలీస్ ఆట ఎంతమంది పిల్లలకు తెలుసు? ఎంత సింపుల్ ఆట ఇది! ఐదారు మంది పిల్లలు కలిసి పంటలు వేసి గెలుస్తారు. ఆఖరున మిగిలినవాడు పోలీస్ అయ్యి గోడ వైపు తిరిగి వంద లెక్కబెడతాడు. ఈ లోపు పిల్లలు దాక్కుంటారు. ఆ దాక్కున్న వాళ్లను పోలీస్ కనిపెట్టాలి. కనిపెట్టలేకపోతే పోలీస్ ఓడిపోతాడు. ఈ ఆట ఆషామాషీ ఆటనా? పిల్లల మెదడుకు తర్ఫీదు ఇస్తుంది.
మున్ముందు జీవితంలో తారసపడబోయే వారిలో ఎవరు దొంగ.. ఎలాంటి దొంగ... వాడి వ్యవహార శైలి ఎలా ఉంటుంది... ఎవరు ఏ మేరకు తప్పించుకోలరు... అదొక్కటేనా? మన వ్యక్తిత్వంలో దొంగ పనులు ఎలా చోటు చేసుకుంటున్నాయి... వాటిని వెతికి పట్టుకొని జైలుకు పంపితే ఎంత మంచి విద్యార్థులం కాగలం... అసలు దొంగలా దాక్కునే బతుకు ఎంత నీచమైనది.... ఇవన్నీ పైకి చెప్పకనే నేర్పిస్తుంది.
ఇవాళ్టి పిల్లలకు కామిక్ హీరో, యూట్యూబ్ గేమర్ తెలుసుకాని దొంగ పోలీస్ తెలీదు. పైగా పిల్లలు ఆ ఆట ఆడుతూ కనిపిస్తే పెద్దలే నవ్వి, జోకులేసి ‘మరీ ఈ ఆటలా’ అని ఆపించేలా ఉన్నారు.
ఆట లేకుంటే ఆందోళన
పిల్లలు ఆడేందుకు పుట్టారు. ఆడి ఆడి వారు పెద్దవాళ్లవ్వాలి. ఆటకు దూరమయ్యి కాదు. ‘పిల్లల చైల్డ్‌హుడ్ యాంగ్జయిటీకి వారు ఆటలకు దూరం కావడమే కారణం’ అంటారు జోనాథన్ హైడ్ అనే సోషల్ సైకాలజిస్టు. ఆటకు బదులు టీవీ, కంప్యూటర్, సోషల్ మీడియాకు బానిసైన ఏ పిల్లవాడైనా దృష్టి చెడి, నిద్ర చెడి, కల్మషం నింపే కలకలం రేపే కంటెంట్‌ను చూసి ఆందోళనకు గురవుతాడు. కదలిక లేని మెదలిక లేని కుర్చీలో కూలబడి కేవలం మెదడుకు ఒత్తిడి ఇవ్వడం ద్వారా మెదడుతో పాటు శరీరం కూడా శుష్కమయ్యి మెదడకు తగిన శక్తి ఇవ్వడంలో వెనుకబడుతుంది.
వివాదాల ఇల్లు
అయితే తల్లిదండ్రులు చాలా నియమాలు పెట్టాలని చూస్తారు. టీవీ ఆఫ్ చేస్తారు. రౌటర్ కట్ చేస్తారు. ఓటీటీ రెన్యువల్ చేయరు. ఈ తల్లిదండ్రులే కోవిడ్ కాలంలో ఇవన్నీ అలవాటు చేశారు. ఇప్పుడు వద్దంటే పిల్లలు మానుతారా? ఆటలు ఆడి శ్రమ చేయడానికి ఇష్టపడకపోగా కుర్చీలో కూలబడి పొందే వినోదం కోసం తల్లిదండ్రులతో ఘర్షణ పడుతూ ఉంటారు. దాంతో ఇంట్లో ఆశాంతి నిండిపోతుంది. అందుకే జోనాథన్ హైడ్ ఏమంటారంటే ముందు పిల్లలకు పుస్తకాలు అలవాటు చేయండి. తర్వాత ఆటల్లోకి తీసుకురండి అని.
కట్టెల మోపు కథ
చనిపోయే ముందు ఒక తండ్రి తన నలుగురు కొడుకులకు ఒక్కొక్క కట్టె ఇచ్చి విరవమంటాడు. వాళ్లు విరుస్తారు. ఇప్పుడు నలుగురి చేతుల్లో ఉన్న కట్టెలను మోపుగా కట్టి విరవమంటాడు. కొడుకులు విరవలేకపోతారు. ‘కలిసి ఉంటే ఇలా బలంగా ఉంటారు’ అని చనిపోతాడు తండ్రి. కొడుకులు ఆ ఐకమత్యాన్ని పాటిస్తారు. కథలు ఎన్నో విషయాలు చెబుతాయి. నేర్పుతాయి. సూక్ష్మబుద్ధిని చూపుతాయి.
సమస్యలు ఎదురైతే తెనాలి రామలింగడిలా దొంగల చేతే బావిలోని నీళ్లన్నీ చేదించి పాదులు తడుపుకునే తెలివితేటలను ఇస్తాయి. భారతదేశంలో నుంచి ప్రపంచం కథలను తీసుకుంటే మన పిల్లలకు మనం కథలను దూరం చేస్తున్నాం. పిల్లల నిపుణులు ఏమంటారంటే బొమ్మలున్న కథల పుస్తకాలు చిన్న పిల్లలకు కామిక్సు, గ్రాఫిక్ నవలలు టీనేజర్లకు ఇచ్చి వారికి పుస్తకాలు అలవాటు చేయమని. పుస్తకం చదివిన పిల్లలు ఆ కథను తోటి పిల్లలతో పంచుకోవాలనుకుంటారు. నలుగురు పిల్లలూ కథలు చెప్పుకోవడానికి కూడతారు. ఆ తర్వాత? ఆడుకుంటారు. ఇదీ ఆరోగ్యకరమైన బాల్యం అంటే.
క్లాసులు... స్పెషల్ క్లాసులు...
ఆటల బదులు మార్కులు, సాటి పిల్లలకు బదులు ట్యూషన్ క్లాసులు చుట్టుముట్టి పిల్లలను ఆందోళనలోకి నెడుతున్నాయి. కాలూ చేయీ కదపని దేహం బుద్ధిని ఎలా కదుపుతుంది? ఫిట్‌గా లేని శరీరం ర్యాంకులు ఎలా తెస్తుంది? ఆటలో పడి లేస్తారు పిల్లలు. అది అలవాటైతే చదువులో పడినా లేవడం తెలుసుకుంటారు. లేదా లేవడానికి కథల్లో చదివిన ఒక ఉదాత్త నాయకుడిని తోడు తెచ్చుకుంటారు. ఆటపాటలు లేకపోవడం వల్లే నేడు పిల్లలు ర్యాంకు రాకపోయినా ఫెయిల్ అయినా చాలా దూరం పోతున్నారు. సెలవులొచ్చాయి. ఆడించండి. చదివించండి. -కె.