బుట్టాయగూడెం: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమరావతి పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలు పెట్టారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త తెల్లం బాలరాజు అన్నారు. మండల కేంద్రమైన బుట్టాయగూడెంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అమరావతికి సంబంధించి మొదటి విడతలో 50 వేల ఎకరాలు తీసుకుని పనులు చేయకుండా బాహుబలి సెట్టింగ్‌లు చేసి రాష్ట్ర ప్రజలకు సినిమా చూపించారని అన్నారు. మళ్లీ రెండో విడతలో 80 వేల ఎకరాలు భూములు సేకరించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అమరావతి భూములు ఇచ్చే విషయంలో రైతులు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. లక్ష ఎకరాలతో అమరావతి పేరుతో చంద్రబాబు నాయుడు దోపిడీకి తెరలేపారన్నారు. అమరావతి పేరుతో రూ.40 వేల కోట్లు అప్పు చేసి రూ.5 వేల కోట్లను అడ్వాన్స్‌గా తన అనుచరులకు దోచిపెట్టారని అన్నారు. ఒక చోటే కేంద్రీకృతం ఉండకూడదని అభివృద్ధి రాష్ట్ర నలుమూలల ఉండాలని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పదే పదే చెబుతూ వస్తున్నారని చెప్పారు. అమరావతికి వ్యతిరేకంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నడూ మాట్లాడలేదని అన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అద్భుతమైన ప్రతిపాదనను తీసుకువచ్చారన్నారు. ఆ ప్రతిపాదనలను కూడా చంద్రబాబు తీసుకునే పరిస్థితి లేదన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపాదించిన మావిగన్‌ను అన్ని వర్గాల ప్రజలు స్వాగతిస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ అల్లూరి రత్నాజీరావు, పార్టీ సీనియర్ నాయకులు ఆరేటి సత్యనారాయణ, ఎంపీపీ తెల్లం రమణ, వైస్ ఎంపీపీ గగ్గులోతు మోహన్‌రావు, తదితరులు పాల్గొన్నారు.


