శ్రీవారి ఆలయంలో హిజ్రాల రౌడీయిజం | - | Sakshi
Sakshi News home page

శ్రీవారి ఆలయంలో హిజ్రాల రౌడీయిజం

Apr 5 2026 8:42 AM | Updated on Apr 5 2026 8:42 AM

శ్రీవారి ఆలయంలో హిజ్రాల రౌడీయిజం

ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయంలో కొందరు హిజ్రాల రౌడీయిజం రోజురోజుకు పెచ్చుమీరుతోంది. పోలీస్‌, దేవస్థానం అధికారులను సైతం వారు లెక్కచేయడం లేదు. దర్శనాలకు వెళ్లే సమయంలో ఆలయంలో వారి దురుసు ప్రవర్తన భక్తులను విస్తుగొలుపుతోంది. ఎవరైనా అడ్డొస్తే వారిపై దౌర్జన్యాలకు దిగుతున్నారు. అంతే కాదు క్షేత్రంలోని అనివేటి మండపం, పరిసర ప్రాంతాల్లో పెళ్లి చేసుకునే వారిని బెదిరించి మరీ రూ.1,000 చొప్పున వసూలు చేస్తున్నారు. అదే కల్యాణ మండపాల్లో డిమాండ్‌ చేసి ఒక్కో పెళ్లికి రూ.5 వేలు వసూలు చేస్తున్నారు. ఇవ్వకపోతే పెళ్లికొడుకు, పెళ్లి కూతురికి, వారి బంధువులకు శాపనార్ధాలు పెట్టడం, బెదిరించడం, నోటికొచ్చిన బూతులు తిట్టడం వంటివి చేస్తున్నారు. దాంతో భీతిల్లుతున్న పెళ్లి బృందాలు ఎందుకొచ్చిన గొడవలే అని వారు అడిగింది ఇచ్చి పంపుతున్నారు.

బెదిరించి రూ.50 వేల వసూళ్లు

సామాన్య, మధ్య తరగతి కుటుంబాల వారే అనివేటి మండపాలు, ఆ పరిసర ప్రాంతాల్లో వివాహాలు జరుపుకుంటారు. ఎందుకంటే పెద్ద పెద్ద కల్యాణ మండపాలకు వేలాది రూపాయల అద్దెలు చెల్లించలేక వారు ఇక్కడ పెళ్లిళ్లు చేసుకుంటారు. అయితే కొందరు హిజ్రాలు అలాంటి వారిని కూడా వదలడం లేదు. పెళ్లి జరిగే సమయంలో వారి వద్దకు వెళ్లి బెదిరించి, శాపనార్ధాలు పెట్టి, ఇష్టం వచ్చినట్టుగా బూతులు తిట్టి, అప్పటికీ వారు అడిగిన డబ్బులు ఇవ్వకపోతే దౌర్జన్యాలకు పాల్పడి ఒక్కో పెళ్లి బృందం నుంచి బలవంతంగా రూ.1,000 చొప్పున వసూలు చేస్తున్నారు. కల్యాణ మండపాల్లో పెళ్లిళ్లు చేసుకునే వారి నుంచి రూ.5 వేలు చొప్పున బలవంతపు వసూళ్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి అనివేటి మండపాలు, పరిసర ప్రాంతాల్లో 50 వరకు వివాహాలు జరగగా, హిజ్రాలు వారి నుంచి రూ.50 వేల వరకూ వసూలు చేశారు.

అంతరాలయానికి పంపలేదని

శనివారం ఉదయం ఇద్దరు హిజ్రాలు, ఒక మహిళను తీసుకుని శ్రీవారి దర్శనానికని వెళ్లగా, అధికారులు వారిని ఆలయంలోకి పంపారు. అయితే అంతరాలయ దర్శనానికి పంపలేదని వారు ఆలయంలో నానా హడావుడి చేశారు. తన చాతీపై చేతులు వేసి నెట్టారంటూ అందులో ఒక హిజ్రా సిబ్బందిని భయపెట్టే ప్రయత్నం చేసింది. అయినా వారు లెక్కచేయక పోవడంతో అక్కడున్న అధికారిని నోటికొచ్చినట్టు తిట్టారు. ఇదంతా చూసిన భక్తులు విసుగుచెందారు. హిజ్రాలు ఆలయంలో ప్రవర్తించిన తీరుపై పలువురు మండిపడ్డారు.

దృష్టి సారించాలి

గతంలో ఓ సారి హిజ్రాలు క్షేత్రంలో జరిగిన ఓ వీఐపీ వివాహానికి వెళ్లి, డబ్బులు డిమాండ్‌ చేసి రచ్చరచ్చ చేశారు. అప్పట్లో ఈ విషయాన్ని పోలీస్‌ ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. పెళ్లిళ్లకు వెళ్లి బలవంతంగా డబ్బులు వసూలు చేసే, రౌడీయిజం చేసే హిజ్రాలపై కేసులు నమోదు చేయాలని అప్పట్లో సీఐ, ఎస్సైలకు ఆదేశాలిచ్చారు. కొద్ది నెలలు మాత్రమే ఆ ఆదేశాలు సక్రమంగా అమలయ్యాయి. ప్రస్తుతం పెళ్లిళ్లు చేసుకునే వారు కొందరు హిజ్రాలు పెడుతున్న ఇబ్బందులను భరించలేక పోతున్నారు. ఇప్పటికై నా పోలీస్‌ ఉన్నతాధికారులు ఈ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

అంతరాలయంలోకి ఎందుకు పంపరంటూ హడావుడి

క్షేత్రంలో ఒక్కో పెళ్లికి రూ. వెయ్యి నుంచి.. రూ. 5 వేలు వరకు బలవంతపు వసూళ్లు

ఇవ్వకపోతే బెదిరింపులు, తిట్లు, అసభ్యకర ప్రవర్తనలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement