పెనుమంట్ర : మాముడూరు గ్రామంలోని సత్తెమ్మ తల్లి ఆలయం సమీపంలో రొయ్యల చెరువుల్లో మట్టి లెవెలింగ్ పనులు చేస్తుండగా ట్రాక్టర్ బోల్తా పడిన ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ బొక్క దుర్గాప్రసాద్ (27) అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన శనివారం మధ్యాహ్నం జరిగింది. మావుడూరు పంచాయతీ వార్డు మెంబర్ బొక్క రామకృష్ణ కుమారుడైన దుర్గాప్రసాద్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. రొయ్యల చెరువులో మట్టి పనులు చేస్తూ ట్రాక్టర్ రివర్స్ చేస్తుండగా బోల్తాపడటంతో ఈ ప్రమాదం జరిగింది. కొడుకు మృతితో ఆ కుటుంబం బోరున విలపిస్తోంది. దుర్గాప్రసాద్ మృతితో గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి. పెనుమంట్ర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కొయ్యలగూడెం: దిప్పకాయలపాడులో శనివారం మధ్యాహ్నం జరిగిన ప్రమాదంలో రెండిళ్లు దగ్ధమయ్యాయి. తంగిరాల వెంకటేష్, షేక్ ఇమాంబిలకు చెందిన ఇళ్ళు అగ్నికి ఆహుతయ్యాయి. పొలం పనులకు వెళ్లిన సమయంలో అగ్ని ప్రమాదం సంభవించిందని స్థానికులు తెలిపారు. ముందుగా వెంకటేష్ ఇంటిలో అగ్ని ప్రమాదం సంభవించగా పక్కనే ఉన్న ఇమాంబి ఇంటికి వ్యాపించిందన్నారు. జంగారెడ్డిగూడెం నుంచి అగ్నిమాపక వాహనం వచ్చి మంటలను అదుపు చేసేసరికి రెండిళ్లు ఆహుతయ్యాయని బాధితులు వాపోయారు. ఇమాంబి ఇంటి నిర్మాణం కోసం తీసుకువచ్చిన లక్ష రూపాయల నగదుతో పాటు బంగారం కాలి బూడిద అయిందని విలపించింది. ఘటనా స్థలం వద్దకు రెవెన్యూ, విద్యుత్ శాఖ, అధికారులు వచ్చి ప్రమాదానికి కారణాలపై విచారణ చేపట్టారు.


