జంగారెడ్డిగూడెం: గుర్వాయిగూడెం మద్ది క్షేత్రంలో శనివారం ఆంజనేయస్వామికి అభిషేక సేవ నిర్వహించారు. ఆలయ ముఖ మండపంపై ఆంజనేయస్వామి ఉత్సవ విగ్రహానికి పంచామృతాలతో అర్చకులు, వేదపండితుల ఆధ్వర్యంలో అభిషేకం నిర్వహించారు. ఆలయానికి వివిధ సేవల రూపేణా రూ.1,66,107 ఆదాయం వచ్చినట్లు ఈవో ఆర్‌వీ చందన తెలిపారు. నిత్యాన్నదాన సత్రంలో సుమారు 1357 మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించినట్లు ఈవో తెలిపారు.
ద్వారకాతిరుమల : ఓ భక్తుడు పోగొట్టుకున్న ట్యాబ్ ఉన్న బ్యాగ్‌ను పోలీసులు కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే సదరు భక్తుడికి అప్పగించారు. వివరాల్లోకి వెళితే.. నల్లజర్ల మండలం పోతవరం గ్రామానికి చెందిన ఏశాంత్ శనివారం శ్రీవారి దర్శనార్ధం ద్వారకాతిరుమలకు విచ్చేశాడు. స్వామివారి దర్శనానంతరం తిరుగు ప్రయాణంలో అతడు తన ట్యాబ్ ఉన్న బ్యాగ్‌ను పోగొట్టుకున్నాడు. వెంటనే స్థానిక పోలీసులను ఆశ్రయించాడు. దాంతో ఎస్సై టి.సుధీర్, కానిస్టేబుల్ లక్ష్మీనారాయణ సీసీ ఫుటేజీల ఆధారంగా బ్యాగ్‌ను కనుగొన్నారు. అనంతరం బ్యాగ్‌ను, అందులోని ట్యాబ్‌ను బాదితుడు ఏశాంత్‌కు భీమడోలు సీఐ పి.కృష్ణ, ఎస్సై సుధీర్‌లు అందజేశారు.
ఏలూరు టౌన్: ఏలూరు రూరల్ మండలం కొమడవోలు గ్రామంలో వివాహిత శనివారం ఆత్మహత్యకు పాల్పడింది. ఆరవల్లి నాగమణి (44) భర్త, పిల్లలతో కలిసి జీవిస్తోంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆమె ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న ఏలూరు రూరల్ ఎస్‌ఐ నాగబాబు, ట్రైనీ ఐపీఎస్ అధికారి జయశర్మ సంఘటనా స్థలానికి వెళ్ళి పరిశీలించారు. ఆత్మహత్యకు కారణాలేంటనే అంశంపై స్థానికులను ఆరా తీశారు.


