ఏలూరు(ఆర్‌ఆర్‌పేట): ఈ వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, అత్యవసరమైతే తప్ప ఎండలో ముఖ్యంగా చిన్నపిల్లలు, గర్భిణులు, వృద్దులు, వ్యాధిగ్రస్తులు బయటకు రాకుండా నివారించాలని కలెక్టర్ కే.వెట్రిసెల్వి అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో ఎండ తీవ్రతపై తీసుకోవలసిన ముందు జాగ్రత్త చర్యలు, ప్రజలను అప్రమత్తం చేయడం తదితర అంశాలపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ఎండ తీవ్రతకు గురికాకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. వడదెబ్బ తగిలిన వారికి తక్షణమే చికిత్స అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రత్యేక వార్డులు ఏర్పాటుచేయాలని, ప్రభుత్వ ఆసుపత్రులు అన్నింటిలోనూ అవసరమైన ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు సిద్ధం చేయాలన్నారు. ఉపాధి హామీ కూలీలకు తాగునీరు, నీడ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ, డీఆర్‌ఓ భాస్కర్, డీపీఓ అనురాధ, జిల్లా పరిషత్ సీఈఓ భీమేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.


