● కౌన్సిల్‌లో పెడితే అవినీతి బయటపడుతుందనే భయం
● రెండో విడత పూలింగ్‌కు కొత్త నాటకం
● వైఎస్సార్‌సీపీ ఏలూరు సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్
ఏలూరు టౌన్: రాజధాని అమరావతి టీడీపీ నేతలకు, చంద్రబాబుకు ఏటీఎంలా మారిపోయిందని, చంద్రబాబుకు నిధులు కావాలంటే అప్పుడు బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొస్తూ.. శాశ్వత భవనాలేమీ కట్టకుండానే నీళ్ళు తోడటానికి, పిచ్చి మొక్కలు పీకటానికి వేలకోట్లు నిధులు ఖర్చు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఏలూరు సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్ విమర్శించారు. అమరావతి రాజధాని అంశంపై చంద్రబాబు తీరుపై ఏలూరులోని పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ధ్వజమెత్తారు. అమరావతిలో మూడు పంటలు పండే పొలాలను రైతుల నుంచి తీసుకున్నారని, ప్లాట్‌లు ఇస్తామంటూ నమ్మించి సుమారు 50 వేల ఎకరాల భూములు సేకరించారని.. ఒక్క శాశ్వత భవనమైనా నిర్మించారా అని ప్రశ్నించారు. డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే అసెంబ్లీలో తీర్మానం పేరిట డ్రామా చేస్తున్నారని, రైతులు రెండో విడత పూలింగ్ చేసేందుకు సహకరించడం లేదనే సాకుతో ఇప్పుడు అసెంబ్లీలో రైతులను మభ్యపెట్టేలా డైవర్షన్ చేయడం నిజం కాదా అని నిలదీశారు. 2028 లోపు అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని చెబుతున్న చంద్రబాబు.. ఎవరైనా మార్చేస్తారంటూ ప్రచారం చేయటం వెనుక ఆంతర్యం ఏమిటో చెప్పాలని జేపీ ప్రశ్నించారు. అసెంబ్లీలో తీర్మానాలు చేశారు సరే.. కౌన్సిల్‌ను పక్కన పెట్టటం దేనికని.. మీరు చేసిన అవినీతి బట్టబయలైపోతుందని, ప్రజలకు మీ అవినీతి తెలుస్తుందనే భయమే కారణం అన్నారు.
ఈ భారమంతా ఎవరు భరిస్తారు?
అమరావతి పేరిట భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి నేడు దారుణంగా ఉందని, ప్లాట్లు డెవలప్‌మెంట్ లేదని, రోడ్లు వేయలేదని, కొన్ని ప్లాట్లు చెరువుల్లో ఉన్నాయని, చంద్రబాబును మరోసారి నమ్మేస్థితిలో రైతులు లేరని అన్నారు. మొదటి దశలో 50 వేల ఎకరాల భూసేకరణ చేశారని, ఒక్కో ఎకరా అభివృద్ధికి రూ.2 కోట్లు చొప్పున రూ.లక్ష కోట్లు అవసరం అన్నారని, మరోసారి సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని అన్నారని.. ఇప్పుడు రెండవ దశలో మరో 20 వేల ఎకరాల భూసేకరణ, అభివృద్ధికి మరో రూ.50 వేల కోట్లు.. ఈ భారమంతా రాష్ట్ర ప్రజలు భరించే స్థితిలో ఉన్నారా? అని ప్రశ్నించారు.
రూ.47 వేల కోట్ల అప్పులు దేనికి?
అమరావతిలో కొత్త భవనాలు కట్టకుండా, డిజైన్ల పేరుతోనే సుమారు రూ.400 కోట్లు ఖర్చు చేస్తున్నారని, పాత టెండర్లను రద్దు చేసి కొత్త టెండర్లు పిలవడం అనుమానాలకు తావిస్తోందని విమర్శించారు. నిజంగా సెల్ఫ్ ఫైనాన్స్ అయితే రూ.47 వేల కోట్లు అప్పులు ఎందుకు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. భూములు విక్రయించి డబ్బులు తెస్తామని చెప్పారని, ఇప్పటివరకూ ఎంత సంపాదించారో ప్రజలకు చెప్పాలన్నారు.
జగన్ అమరావతికి వ్యతిరేకం కాదు
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమరావతికి వ్యతిరేకం కాదని ఎప్పుడో స్పష్టం చేశారని, మీ అవినీతికి, మోసానికి వ్యతిరేకమని స్పష్టం చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ అమరావతిలోనే ఇల్లు కట్టుకున్నారనే విషయాన్ని మర్చిపోవద్దన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, రాష్ట్రంలో ప్రజలంతా అభివృద్ధి ఫలాలు అనుభవించాలనే ప్రణాళికతో పాలన వికేంద్రీకరణకు మొగ్గుచూపారని స్పష్టం చేశారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ కై కలూరు పరిశీలకుడు నూకపెయ్యి సుధీర్‌బాబు, చింతలపూడి పరిశీలకుడు దాసరి రమేష్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు నెరుసు చిరంజీవి, అధికార ప్రతినిధి జాన్‌గురునాథ్, నగర బీసీ సెల్ అధ్యక్షులు కిలాడి దుర్గారావు, ప్రధాన కార్యదర్శి లంకలపల్లి గణేష్, మహిళ ప్రధాన కార్యదర్శి తుమరాడ స్రవంతి, వైఎస్సార్‌టీయూ జిల్లా అధ్యక్షుడు పల్లి శ్రీనివాస్, విద్యార్థి విభాగం అధ్యక్షులు రాజేష్ తదితరులు పాల్గొన్నారు.


