చోరీ కేసులో షాకింగ్ అంశం..
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చిన్నవెంకన్న ఆలయ హుండీల నగదు, కానుకల లెక్కింపు వేళ.. అధికారులు అలర్ట్ అయ్యారు. సోమవారం జరిగిన లెక్కింపులో అధికారులు పలు నిఘా ఏర్పాట్లు చేయడంతో పాటు, భద్రతా సిబ్బంది ప్రతి ఒక్కరిని మెటల్ డిటెక్టర్లతో తనిఖీలు చేశారు. వివరాల్లోకి వెళితే. ఈనెల 11న ప్రమోదా కల్యాణ మండపంలో జరిగిన హుండీల నగదు లెక్కింపులో పశ్చిమగోదావరి జిల్లా, ఇరగవరం మండలం, సూరంపూడి గ్రామానికి చెందిన బొల్లా సురేష్ అనే వ్యక్తి సేవకుడిగా పాల్గొని 59 గ్రాముల 700 మిల్లీ గ్రాముల బరువైన బంగారు చైన్, రెండు మంగళ సూత్రాలు, 4 డాలర్ నోట్లను చోరీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై అదే రోజు దేవస్థానం ఈఓ వై.భద్రాజీ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, ఎస్సై టి.సుధీర్ కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు. అందులో భాగంగా నిందితుడి బ్యాంక్ అకౌంట్ లోని రూ. 5.10 లక్షలను ఫ్రీజ్ చేశారు. విచారణ అనంతరం నిందితుడిని భీమడోలు కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి అతడికి బెయిల్ మంజూరు చేశారు. అయితే ఈ చోరీ ఘటన సంచలనంగా మారడంతో దేవస్థానం, పోలీస్ అధికారులు అప్రమత్తమయ్యారు. అందులో భాగంగా ఈసారి కౌంటింగ్ హాలు వద్ద ప్రత్యేకంగా పోలీస్ సిబ్బందిని నియమించారు. లెక్కింపు పూర్తయ్యే వరకు ఎస్సై టి.సుధీర్ తనిఖీలను పరిశీలించారు.
రిజిస్టర్డ్ సేవా దళాలను మాత్రమే..
రిజిస్టర్డ్ సేవాదళాలను మాత్రమే లెక్కింపునకు అనుమతించారు. సేవలో పాల్గొన్న ప్రతి సభ్యుడి వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేసి, వారి నుంచి సంతకాలు సేకరించారు. ఈ లెక్కింపులో పలు సేవా దళాలకు చెందిన 130 మంది పాల్గొనగా, దేవస్థానం అధికారులు, రెగ్యులర్ ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది, కల్యాణకట్టలోని నాయీ బ్రాహ్మణులు మొత్తం 150 మంది వరకు పాల్గొన్నారు. ఇక ముందు జరిగే లెక్కింపులో పాల్గొనే సేవాదళ సభ్యులు తప్పనిసరిగా ఐడెంటిటీ కార్డులు ధరించాల్సి ఉంటుంది.
ప్రత్యేక నిఘా..
కౌంటింగ్ హాల్లోకి వెళ్లే వారిని, బయటకు వచ్చే వారిని డోర్‌ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్ (డీఎఫ్‌ఎండీ), హ్యాండ్ హెల్డ్ మెటల్ డిటెక్టర్ (హెచ్‌హెచ్‌ఎండీ) ద్వారా భద్రతా సిబ్బంది తనిఖీలు చేశారు. లోదుస్తులు (అండర్‌వేర్)ను తొలగించి, పంచి, కండువా ధరించిన వారిని మాత్రమే లెక్కింపునకు అనుమతించారు. అలాగే లెక్కింపు అందరికీ కనిపించేలా కౌంటింగ్ హాల్లో ఎల్‌ఈడీ మానిటర్ ఏర్పాటు చేసి, ఈఓ పర్యవేక్షించారు. ముడుపులు, విదేశీ, పెద్ద కరెన్సీ నోట్ల లెక్కింపును సూపరింటెండెంట్‌ల పర్యవేక్షణలో నిర్వహించారు. తనిఖీలకు మరింత అత్యాధునిక స్కానర్లను వినియోగించాల్సిన అవసరం ఉందని స్థానికులు, పలువురు భక్తులు అంటున్నారు.
కౌంటింగ్ హాలు వద్ద భద్రతను పరిశీలిస్తున్న ఎస్సై సుధీర్
ముడుపుల వద్ద పర్యవేక్షిస్తున్న సూపరింటెండెంట్ పద్మావతి
బొల్లా సురేష్ చోరీ కేసులో షాకింగ్ అంశం బయటపడింది. శ్రీవారి దేవస్థానంలో జరిగే హుండీల నగదు, కానుకల లెక్కింపులో చోరీ చేయడం సులభమని అతడు పోలీసుల విచారణలో చెప్పినట్టు తెలిసింది. ఇతర దేవాలయాల్లో లోదుస్తులతో లెక్కింపునకు అనుమతించరని, ఇక్కడ ఆ నిబంధన లేకపోవడమే అందుకు కారణమని చెప్పినట్టు సమాచారం. అందుకే లోదుస్తులు లేకుండా లెక్కింపులో పాల్గొనే పద్ధతిని ఇక్కడా అమలు చేస్తున్నారు.
శ్రీవారి హుండీల నగదు, కానుకల లెక్కింపులో.. పటిష్ట బందోబస్తు నిర్వహణ
కౌంటింగ్ హాలు వద్ద మెటల్ డిటెక్టర్ల ఏర్పాటు
ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీలు చేసిన భద్రతా సిబ్బంది
అత్యాధునిక స్కానర్లు ఏర్పాటు చేయాలంటున్న భక్తులు


