● నాలుగు పూరిళ్లు దగ్ధం
● రూ.50 లక్షల ఆస్తినష్టం
వేలేరుపాడు: వేలేరుపాడు మండల పరిధిలోని చిగురుమామిడి గ్రామంలో సోమవారం మధ్యాహ్నం జరిగిన అగ్ని ప్రమాదంలో నాలుగు పూరిళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. సుమారు రూ.50 లక్షల ఆస్తినష్టం సంభవించింది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన చండ్రుగొండ సత్తిబాబు, చిన్న నర్శింహులు, ఎక్కిళ్ళ శ్రీను, సింగ్‌బాబు మిర్చి రైతులు. సోమవారం మిర్చి కోతలు ఉండటంతో అంతా పొలాలకు వెళ్లారు. మధ్యాహ్న సమయంలో ముందుగా చిన్న నర్శింహులు ఇంట్లో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఆ తర్వాత పక్కనున్న మూడు ఇండ్లకు మంటలు వ్యాపించాయి. అక్కడ నుంచి ఇతర ఇండ్లకు మంటలు వ్యాపించకుండా గ్రామస్తులు మంటలను అదుపుచేశారు. బాధితుల ఇళ్లల్లో గ్యాస్ సీలిండర్లు పేలడం, 33 కిలోమీటర్ల దూరంలోని కుక్కునూరు నుంచి ఫైర్ ఇంజన్ వచ్చేసరికే గృహోపకరణాలు, నగదు, బంగారు ఆభరణాలు దగ్ధమయ్యాయి. ప్రమాదంలో చండ్రుగొండ సత్యంకు చెందిన విద్యుత్ పిండి మిల్లు, డీజిల్ ఇంజన్, చిన్న నర్శింహులుకు చెందిన ఓ ద్విచక్రవాహనం, ఎక్కిళ్ళ శ్రీనుకు చెందిన కుట్టుమిషన్ కాలిపోయింది. చండ్రుగొండ సత్తిబాబుకు చెందిన రూ.2.20 లక్షలు, 10 కాసుల బంగారం, 5 కాసుల వెండి ఆభరణాలు, సింగ్‌బాబుకు చెందిన రూ.లక్ష నగదు, 8 కాసుల బంగారం, నాలుగు జతల వెండి పట్టీలు, ఎక్కిళ్ళ శ్రీనుకు చెందిన రూ.2 లక్షల నగదు, ఐదు కాసుల బంగారం, నాలుగు కాసుల వెండి ఆభరణాలు, చిన్న నర్శింహులుకు చెందిన 5 కాసుల బంగారం, లక్షా యాభైవేల నగదు, 6 కాసుల వెండి కాలిబూడిదయ్యాయి. బాధితులకు తక్షణ ప్రభుత్వ సాయం అందలేదు. బాధితులను వైఎస్సార్ సీపీ నేతలు పరామర్శించారు. కట్కూరు సర్పంచ్ లక్ష్మణ్, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ కేసగాని శ్రీనివాసగౌడ్, కామినేని వెంకటేశ్వరావు, కౌలూరి సత్తిరాజు, చక్రి, అత్తిలి వెంకన్న బాధితులను పరామర్శించారు.


