● మరింత దిగజారిన కనిష్ట ధర
● సరాసరి కూడా పడిపోతుందని రైతుల ఆందోళన
జంగారెడ్డిగూడెం: వర్జీనియా ధర మరింత క్షీణించింది. గరిష్ట ధర స్థిరంగా ఉన్నప్పటికీ కనిష్ట ధర గత ట్రేడింగ్ సెషన్‌తో పోల్చితే మరో ఐదు రూపాయలు దిగజారింది. వర్జీనియా వేలం ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి రైతులు ధరపై ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. కేజీ ఒక్కింటికి రూ.350 పైబడి ధర వస్తేనే సగటు ధర మెరుగ్గా వచ్చి రైతులు నష్టాల రాకుండా గట్టెక్కగలరని పేర్కొంటున్నారు. సీజన్ ముగిసే నాటికి సరాసరి ధర రూ.330 నుంచి రూ. 350 మధ్య వస్తేనే రైతుకు గిట్టుబాటు అవుతుందని వర్జీనియా రైతు సంఘం నాయకులు పేర్కొంటున్నారు. అయితే ప్రారంభం రోజునే అంచనాలను తారుమారుచేస్తూ గత ఏడాది ప్రారంభ ధర కన్నా తక్కువగా రూ. 265 వద్ద వేలం ప్రారంభమైంది. తొలి రోజే పొగాకు బోర్డు చైర్మన్ యశ్వంత్‌కుమార్‌కు రైతులు తమ అసంతృప్తిని, ఆందోళనను తెలియజేశారు. అయినప్పటికీ పరిస్థితిలో మార్పు రాకపోగా ధర పతనమవుతోంది. గరిష్ట ధర స్థిరంగా ఉండి, కనిష్ట ధర పడిపోతూ ఉంటే, సరాసరి కూడా అదే రీతిలో తగ్గిపోతుందని, ఇదిలా కొనసాగితే చివరకు సగటున కేజీ ఒక్కింటికి రూ.100 నుంచి రూ. 120 వరకు నష్టం వచ్చే అవకాశం ఉంటుందని రైతులు వాపోతున్నారు.
రోజు విడిచి రోజు వేలం
ఎన్‌ఎల్‌ఎస్ పరిధిలోని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఐదు వేలం కేంద్రాల్లో జంగారెడ్డిగూడెం–1, –2 వేలం కేంద్రాలు మినహాయించి, దేవరపల్లి, కొయ్యలగూడెం, గోపాలపురం వేలం కేంద్రాల్లో సోమవారం వేలం జరిగింది. వేలం నిర్వహణకు బయ్యర్లు, సిబ్బంది కొరత రావడం, కర్ణాటకలో వేలం ప్రక్రియ జరుగుతుండటంతో రోజు విడిచి రోజు వేలం నిర్వహించనున్నారు. వచ్చే నెల రోజుల పాటు ఇలానే కొనసాగుతుందని అధికారులు తెలుపుతున్నారు. దేవరపల్లి, కొయ్యలగూడెం, గోపాలపురంలలో ఒక రోజు, జంగారెడ్డిగూడెం–1, –2 వేలం కేంద్రాల్లో ఒక రోజు నిర్వహించేలా నిర్ణయించినట్లు చెప్పారు. దేవరపల్లి వేలం కేంద్రానికి 6 బేళ్లు తీసుకురాగా, వాటిలో 3 తిరస్కరణకు గురై 3 బేళ్లు అమ్ముడయ్యాయి. ఇక్కడ ధర స్థిరంగా రూ. 265 పలికింది. కొయ్యలగూడెం వేలం కేంద్రానికి 113 బేళ్లు రాగా, వాటిలో 54 బేళ్లు తిరస్కరించారు. 59 బేళ్లు కొనుగోలు జరగ్గా, ఇక్కడ గరిష్ట ధర రూ.265, కనిష్ట ధర రూ.250 నమోదైంది. అలాగే గోపాలపురం వేలం కేంద్రాలో 97కు గాను 79 బేళ్లు అమ్మకాలు జరగ్గా, ఇక్కడ కూడా గరిష్టం రూ. 265, కనిష్టం రూ.250 నమోదైంది. మొత్తంగా గరిష్ట ధర రూ.265, కనిష్ట ధర రూ.250 రాగా, సరాసరి ధర రూ. 257.85 లభించింది.
వర్జీనియా పొగాకు బేళ్లు


