టి.నరసాపురం: పామాయిల్ గెలలు నరుకుతుండగా విద్యుదాఘాతంతో యువకుడు మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజుపోతేపల్లి గ్రామానికి చెందిన చెన్ని శివాజీ (23) పామాయిల్ గెలలు నరికే పనికి వెళుతూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో ఎప్పటిలాగానే మరో ఇద్దరు కూలీలతో కలసి మండలంలోని గుడ్లపల్లికి చెందిన రైతు పామాయిల్ తోటలో గెలులు నరకడానికి వెళ్లాడు. పామాయిల్ గెలలు నరుకుతుండగా గెడ కత్తి విద్యుత్ తీగలకు తగిలి విద్యుదాఘాతానికి గురయ్యాడు. దీంతో తోటి కూలీలు 108కి ఫోన్ చేయగా సిబ్బంది వచ్చి అతడిని పరిశీలించి, అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చింతలపూడి తరలించారు.


