భక్తుడిపై ఈఓ ఆగ్రహం
● క్షీరారామలింగేశ్వరుని రథం విషయంలో వింత పనులు
● టేకు రథానికి ప్లే ఉడ్‌తో మెరుగులు
● అధికారుల తీరుపై భక్తుల మండిపాటు
పాలకొల్లు సెంట్రల్: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పంచారామక్షేత్రమైన శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో అధికారులు చేస్తున్న వింత పనులపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వామి వారి రథం అంటే భక్తులకు ఎంతో సెంటిమెంట్. అయితే ఇటీవల గోల్డ్ కోటింగ్ పనుల పేరుతో టేకు చెక్కతో ఉన్న రథానికి ప్లైఉడ్‌తో ఫిటింగ్ పనులు చేస్తున్నారు. ఈ చర్యలపై భక్తులు అధికారుల తీరుపై మండిపడుతున్నారు. సాధారణంగా మరమ్మతుల విషయంలో ఆగమశాస్త్రానికి అనుగుణంగా అర్చకులు, అధికారులు వ్యవహరించాల్సి ఉంటుంది. భక్తులు ఆలయం విషయంలో ఏదైనా అనుమానం వ్యక్తం చేసినా ఆగమ శాస్త్రం ఒప్పుకోదంటూ, శృంగేరి పీఠాధిపతులతో సంప్రదించాలని అర్చకులు చెబుతూ ఉంటారు. అయితే రథం విషయంలో ప్లై ఉడ్‌తో కవరింగ్ పనులు చేస్తున్నా అర్చకులు ఈఓ, పాలకమండలి సభ్యుల తీరుపై పెదవి విప్పకపోవడం గమనార్హం. దీంతో వారు ఇష్టానుసారం ఆలయంలో వింత పనులు చేసుకుంటూపోతున్నారు. సుమారు మూడేళ్ల క్రితం పాడై ఉన్న స్వామివారి రథాన్ని ఓ భక్తుడు టేకు చెక్కతో మరమ్మతులు చేయించి అత్యంత శోభాయమానంగా తీర్చిదిద్దించాడు. నేడు ఆ రథానికి గోల్డ్ కోటింగ్ పేరుతో ఇష్టానుసారంగా చేస్తున్నారని అధిక సంఖ్యలో భక్తులు మండిపడుతున్నారు.
భక్తుడు ఫోన్ లాక్కున్న సిబ్బంది
సాధారణంగా ఆలయాల్లో ధ్వజ స్థంభం ఏర్పాటు చేసినా, రథం తయారు చేసినా ఎక్కువగా టేకు లేదంటే దేవదారు, చండ్ర వంటి కలపను ఉపయోగిస్తూ ఉంటారు. కానీ క్షీరారామలింగేశ్వరుని రథం విషయంలో మాత్రం టేకు చెక్కతో ఉన్న రథాన్ని ప్లైఉడ్‌తో మూసేసి దానిపై రాగి తాపడం చేయించి గోల్డ్ కోటింగ్ కొట్టిస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే ప్లైఉడ్‌తో రథాన్ని ఎలా తయారు చేయిస్తారని ఓ భక్తుడు ఆ రథాన్ని ఫొటో తీసి ప్రశ్నించినందుకు అక్కడి సిబ్బంది ఆ భక్తుడి ఫోన్ లాక్కుని ఫొటో ఎందుకు తీశావు? అంటూ ఆ ఫొటోను డిలీట్ చేసి ఫోన్ భక్తుడికి ఇచ్చాడు. అయితే ఆ ఫోన్‌లోని రథం ఫొటో ఒకటి ఉండడంతో వెంటనే సదరు భక్తుడు విషయాన్ని ఈఓకు తెలియజేశాడు.
రథాన్ని ప్లైఉడ్‌తో మరమ్మతులు చేయడాన్ని ఫొటో తీస్తుండగా ఆలయంలో టెంపరరీగా పని చేస్తున్న ఓ ఉద్యోగి తన ఫోన్ లాక్కున్నాడని రెండు రోజులు క్రితం భక్తుడు గూడపాటి దుర్గా వరదభుజంగరావు ఆలయ ఈఓ ముచ్చర్ల శ్రీనివాసరావుకు ఫోన్ చేశాడు. అయితే చర్యలు తీసుకోవాల్సిన ఈఓ తిరిగి భక్తుడిపైనే ఆగ్రహం వ్యక్తం చేయడం విశేషం. ‘మా అర్చకులు, అధికారులు, పాలకమండలి సభ్యులకు లేని ఇబ్బంది నీకెందుకు?’ అంటూ భక్తుడిపై ఆయన మండిపడ్డారు. నీకు వేరే పనిలేదా? ఇదే పని మీద ఉంటున్నావా? గుళ్లో చెక్క పెట్టారా? ప్లై ఉడ్ పెట్టారా? ఆయిల్ రాశారా? అసలు గుళ్లో ఇదే పనా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము ఉద్యోగం చేసుకోవాలా? మానేయాలా? నువ్వు ఎన్ని పిటిషన్లు పెట్టుకుంటావో? పెట్టుకో నేను చూస్తానులే అంటూ ఆ భక్తుడిపై సహనం కోల్పోయి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికై నా అధికారులు, పాలకవర్గ సభ్యులు, అర్చకులు భక్తుల మనోభావాలను గౌరవించి రథం పనులు చేయాలని కోరుతున్నారు.


