కొయ్యలగూడెం: ఏజెన్సీ ప్రాంతంలో నాటు సారా విక్రయాలు యథేచ్ఛగా మండలంలో కొనసాగుతున్నాయి. మండలం సరిహద్దు ప్రాంతాలతో పాటు మంగపతిదేవిపేట, గంగవరం గ్రామాల్లోని మారుమూల ప్రాంతాలలో నాటుసారా బట్టీలను ఏర్పాటు చేసి అక్రమార్కులు నాటుసారా క్రయవిక్రయాలు చేస్తున్నారు. అచ్యుతాపురం గ్రామ పంచాయతీ పరిధిలో మద్యం బెల్ట్ షాపుల మాదిరిగా నాటుసారా దుకాణాలు ఏర్పాటు చేసి విక్రయాలు చేస్తున్నారని మహిళలు గగ్గోలు పెడుతున్నారు. గతంలో ఎకై ్సజ్ శాఖ అధికారలుకు ఫిర్యాదు చేసిన ఫలితం లేకుండా పోయిందని వాపోతున్నారు. నాటుసారా క్రయవిక్రయాలు చేస్తున్న వ్యక్తులు తాము మామూళ్లు ఇవ్వాల్సిన అధికారులకు సొమ్ములు ముట్ట చెబుతున్నామని తమను ఎవరు ఏమీ చేయలేరు అంటూ ధీమాగా మాట్లాడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఫిర్యాదు చేసిన వ్యక్తులపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని రైతులు చెబుతున్నారు. వర్జీనియా పొగాకు సీజన్ ప్రారంభం అయిన నేపథ్యంలో ఇతర జిల్లాల నుంచి వస్తున్న వలస కార్మికులు నాటుసారాకి బానిసలుగా మారుతున్నారన్నారు. రాత్రి వేళల్లో యువకులు బైక్‌ల మీద ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నారన్నారు. గంగవరం గ్రామంలో సైతం నాటు సారావిక్రయాలు పెచ్చు మీరాయని రైతులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులు నాటు సారా క్రయ విక్రయాలు అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.


