పెనుగొండ : పంచాయతీ స్థలాలు ఆక్రమణలు, ప్రజలకు ఇబ్బంది కలిగించే ఆక్రమణలు గుర్తించి సత్వరం తొలగించాలని జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవారం పెనుగొండలో ఆకస్మిక తనిఖీలు చేశారు. రైతు బజారు ఏర్పాటు, చిల్డ్రన్ పార్కు ఏర్పాటుకు స్థలాలను పరిశీలించారు. అనంతరం సంత మార్కెట్, పంచాయతీ కాంప్లెక్స్‌ల వద్ద ఆక్రమణలను పరిశీలించారు. పంచాయతీ కాంప్లెక్స్ అద్దెల వివరాలను ఆరా తీశారు. వేలంలో దక్కించుకొంటున్నవారే షాపుల నిర్వహిస్తున్నారా? తిరిగి ఇతరులకు అద్దెకిస్తున్నారా? అని ప్రశ్నించారు. దుకాణాలను ఆకస్మిక తనికీ చేసి ప్లాస్టిక్ వినియోగంపై తగు చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో పార్కుల ఏర్పాటు వలన ప్రజలకు స్వచ్ఛమైన వాతావరణం లభిస్తుందన్నారు. ఆయన వెంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ సర్పంచ్ నక్కా శ్యామలాసోనీ శాస్త్రి, సొసైటీ ఛైర్మన్ నక్కా వేద వ్యాస శాస్త్రి ఉన్నారు.
ఆచంటలో
ఆచంటలో రైతు బజారు, చిల్డ్రన్ పార్కు ఏర్పాటుకు స్థలాలను శుక్రవారం జాయింట్ కలెక్టరు టి.రాహుల్‌కుమార్‌రెడ్డి పరిశీలించారు. జిల్లాలో గ్రామాభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రజా సౌకర్యాల విస్తరణపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించిందన్నారు. అనంతరం ఆచంట రామేశ్వర స్వామిని దర్శించుకుని పూజలు చేశారు.
యువకుడి అదృశ్యం
తణుకు అర్బన్: తణుకుకు చెందిన యువకుడు తాను చనిపోతున్నానంటూ కుటుంబ సభ్యులకు వాయిస్ మెసేజ్ పెట్టి అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. తణుకు పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణానికి చెందిన చిట్టూరి భీమరాజు (25) గురువారం రాత్రి తన కుటుంబ సభ్యులకు తాను చనిపోతున్నానని చెబుతూ వాయిస్ మెసేజ్ పెట్టి అదృశ్యమయ్యాడు. అతని బైక్, చెప్పులు వెంకట్రాయపురం ఆంధ్రా సుగర్స్ సమీపంలోని కాలువ వంతెన వద్ద కనిపించడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు కాలువ వెంబడి గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఎంతకూ భీమరాజు ఆచూకీ లభ్యం కాకపోవడంతో శుక్రవారం తణుకు పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. అయితే భీమరాజు వినియోగిస్తున్న సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా అతన్ని గుర్తించేందుకు ప్రయత్నిన్నామని తణుకు పట్టణ ఎస్‌సై కె.శ్రీనివాస్ తెలిపారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రేపు అండర్–9 చదరంగం పోటీలు
తాడేపల్లిగూడెం (టీఓసీ): మాస్టర్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం తాడేపల్లిగూడెం అండర్–9 బాల బాలికల చదరంగం పోటీలు నిర్వహిస్తామని జిల్లా టోర్నమెంట్ కమిటీ కన్వీనర్ ఎస్‌ఎస్ చంద్రశేఖర్ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 01.01.2017 తరువాత పుట్టిన వారు మాత్రమే పోటీలకు అర్హులన్నారు. మొదటి, రెండు స్థానాలు సాధించిన క్రీడాకారులు జూన్ నెలలో తూర్పుగోదావరి జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి అండర్–9 పోటీలకు ఎంపిక అవుతారని తెలిపారు. మరిన్ని వివరాలకు 94408 67370 నంబర్‌కు ఫోన్ చేయాలని ఆయన సూచించారు.


