ఏలూరు (టూటౌన్): మతం మారినంత మాత్రాన కులం మారుతుందా? అని ఆల్ ఇండియా అంబేడ్కర్ యువజన సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మెండెం సంతోష్‌కుమార్ ప్రశ్నించారు. స్థానిక ఎన్‌ఆర్‌ఫేటలోని ఎస్‌సీఆర్పీఎస్, ఏఐఏవైఎస్ రాష్ట్ర కార్యాలయంలో భారత రాజ్యాంగం, ఎస్సీ క్రైస్తవులు సుప్రీంకోర్టు తీర్పు అనే అంశంపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల సుప్రీంకోర్టు ఎస్సీ క్రైస్తవులపై ఇచ్చిన తీర్పుపై పునరాలోచన చేయాలని కోరారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం మత స్వేచ్ఛ మత హక్కు మత పరిరక్షణ స్వేచ్ఛగా తీసుకునే అర్హత కలిగినా, దాని ఆధారంగా రిజర్వేషన్ లేదని చెప్పడం అన్యాయమన్నారు. కార్యక్రమంలో రాజ్యాంగ ధర్మ పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ ఎన్‌ఏడీ పాల్, పాస్టర్ యోహాను రిటైర్డ్ ఎస్సై పాక ప్రభాకర్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.
తణుకు అర్బన్: ప్రమాదవశాత్తూ కాలువలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం తణుకులో చోటు చేసుకుంది. స్థానిక వేల్పూరు రోడ్డులోని వీమాక్స్ థియేటర్ సమీపంలో నివాసం ఉంటున్న కోలా శ్రీనివాస్ (58) స్నానం చేసేందుకు కాలువలోకి దిగాడు. అయితే ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి మృతి చెందాడు. శ్రీనివాస్ భార్య ఏడేళ్ల క్రితం చనిపోగా, సెంట్రింగ్ పనులు చేసుకుంటూ తన కుమారుడి వద్ద ఉంటున్నారు. శుక్రవారం శ్రీరామనవమి కావడంతో జుట్టు కత్తిరించుకునేందుకు వెళ్లిన శ్రీనివాస్ పెద్ద వంతెన సమీపంలో కాలులో స్నానానికి దిగాడు. ప్రమాదవశాత్తూ మునిగిపోవడంతో మృతదేహం కొద్ది దూరంలో బయటపడింది. ఈ మేరకు మృతుడి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తణుకు పట్టణ ఎస్‌సై కె.శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇద్దరికి తీవ్ర గాయాలు
భీమడోలు: గుండుగొలను– కొవ్వూరు జాతీయ రహదారి పొలసానిపల్లి వద్ద శుక్రవారం హైవేపై కూలీలున్న ఓ ట్రాక్టర్‌ను ఓ కారు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పొలసానిపల్లి వద్ద హైవేపై కూలీలు మొక్కలు, రోడ్డు పరిశుభ్రం చేసే పనుల కోసం వచ్చారు. అయితే రాజమండ్రి నుంచి ఏలూరు వైపుగా వస్తున్న కారు ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ బోల్తా కొట్టింది. ట్రాక్టర్‌లో ఉన్నభీమడోలుకు చెందిన సూపర్‌వైజర్ అఖిల్, మహిళా కూలీ పెద్దింట్లుకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న భీమడోలు 108 అంబులెన్స్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని, వారిని చికిత్స కోసం ఏలూరు ఆశ్రం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై భీమడోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


