కొయ్యలగూడెం : మండలంలో మట్టి తోలకాలకు అద్దూఅదుపు లేకుండా పోతోంది. సాగునీటి చెరువుల నుంచి ట్రక్కుల ద్వారా అక్రమార్కులు మట్టిని తరలిస్తున్నారు. శుక్రవారం శ్రీరామనవమి సెలవు దినం కావడంతో అధికారుల పర్యవేక్షణ ఉండదనే భావనతో అక్రమార్కులు రెచ్చిపోయారు. రింగు రోడ్డు గ్రామాల్లో ఉన్న సాగునీటి చెరువుల నుంచి మట్టిని అక్రమంగా తరలించారు. వరుసగా నాలుగు రోజులు సెలవు దినాలు రావడంతో వందల ట్రక్కుల మట్టిని తోలడానికి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. సాగునీటి చెరువుల్లోని మట్టిని కమర్షియల్ అవసరాలకు ఉపయోగిస్తున్నప్పటికీ అధికారులు పర్యవేక్షణ లేకపోవడంపై స్థానిక రైతుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో రాత్రి వేళల్లో మట్టి తోలకాలు సాగించగా ఇప్పుడు పట్టపగలే మట్టి తోలకాలు చేస్తున్నారని వాపోతున్నారు. ఈ అక్రమ తోలకాల వల్ల రహదారులు అధ్వానంగా మారుతున్నాయని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. పశువులదాహార్తి కోసం చెరువులలో ఉన్న కొద్దిపాటి నీటిని కలుషితం చేస్తున్నారని దీంతో పశువులకు తాగడానికి నీరు కూడా దొరకడం లేదని పాడి రైతులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


