భీమవరం (ప్రకాశంచౌక్): జువ్వలపాలెంలో శ్రీ దంతులూరి జగన్నాథరాజు సత్రం అనుబంధ సంస్థ వెంకటేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం ఉదయం సూర్యకిరణాలు ప్రసరించాయి. ఈ విషయం తెలియగానే ఆలయ పరిసర ప్రాంత ప్రజలు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. పలువురు భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.
పాలకొల్లు సెంట్రల్: స్థానిక క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో స్వామివార్ల కల్యాణోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి గణపతి పూజ, అంకురార్పణ, ధ్వజారోహణ, అగ్ని ప్రతిష్ఠాపన, బలిహరణ పూజలు చేశారు. రాత్రి తెల్లవారితే ఆదివారం శ్రీ పార్వతి సమేత శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి, శ్రీ లక్ష్మీ సమేత శ్రీ జనార్దనస్వామి వారి సప్తాహ్నక కల్యాణం నిర్వహించనున్నారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మీసాల రామచంద్రరావు, ట్రస్ట్‌బోర్డు సభ్యులు, ఆలయ అభిషేక పండిట్ భమిడపాటి వెంకన్న, మద్దూరి సూరిబాబు, ఫని, ఆలయ ప్రధానార్చకులు కోట అనిల్, కిష్టప్ప తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి స్థానిక ఏలూరు కోటదిబ్బ జూనియర్ కాలేజీలో జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్ష పత్రాల మూల్యాంకన కేంద్రాన్ని శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా మూల్యాంకన విధులకు హాజరైన అధ్యాపకుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారికి కల్పిస్తున్న సౌకర్యాలు ఆరా తీశారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షురాలు బొర్రా సుభాషిణి, జిల్లా కార్యదర్శి ఈడే శివశంకరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం యూటీఎఫ్ కేంద్ర కార్యలయానికి చేరుకుని విధాన పరమైన ముఖ్యమైన విషయాల గురించి యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రుద్రాక్షి రవికుమార్‌ను అడిగి తెలుసుకున్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): స్థానిక హిందూ యువజన సంఘం 122వ వార్షికోత్సవాల్లో భాగంగా స్థానిక వైఎంహెచ్‌ఏ హాలులో శుక్రవారం శ్రీరామనవమి ఉత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి. తొలుత వేదికపై సీతారామ సమేత లక్ష్మణ ఆంజనేయ స్వామిని పట్టు వస్త్రాలతో అలంకరించి, పూజలు చేశారు. సాయంత్రం ధనలక్ష్మి బృందం విష్ణు సహస్రనామ పారాయణం భక్తి పారవశ్యంలో ముంచెత్తింది. బీకే బిందు ఆలాపనలో సాయిగణేష్ చారి బృందం ఆలపించిన సాకేత రామ సంకీర్తనం మంత్రముగ్ధులను చేసింది. కళారత్న పార్వతీ రామచంద్రన్ శిష్యులు ప్రదర్శించిన సుందరకాండ కూచిపూడి నృత్య రూపకం, రామ కీర్తనలకు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కార గ్రహీతలు సోమ్లా నాయక్, ప్రముఖ సంగీత కళాకారుడు ఎస్‌పీఎస్ వాసులను దుశ్శాలువా, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో హిందూ యువజన సంఘం మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుడు యర్రా సోమలింగేశ్వర రావు, ప్రధాన కార్యదర్శి కేవీ సత్యనారాయణ, కోశాధికారి కానాల బాల వెంకట రమేష్ తదితరులు పాల్గొన్నారు.


