తాడేపల్లిగూడెం: పట్టణ ఇలవేల్పు బలుసులమ్మ తల్లి జాతర మహోత్సవాలలో భాగంగా తల్లికి ప్రీతికరమైన శుక్రవారం మహాకుంభాభిషేకం శుక్రవారం నిర్వహించారు. ఉదయం ఆలయ శిఖరం నుంచి బూరెలు పోశారు. మహుకుంభ నివేదన అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసు, ఉత్సవ కమిటీ చైర్మన్ శ్రీరంగం అంజి ప్రారంభించారు. భక్తులు సమర్పించిన బూరెలు, స్వీట్లు ఇచ్చారు. వీటిని రాశులుగా పోసి అన్నప్రసాదంలో పంచారు. మూడు ప్రాంతాల్లో ఈ కార్యక్రమం ఏర్పాటుచేయడంతో వచ్చిన భక్తులు ఇబ్బంది పడకుండా అమ్మ ప్రసాదాన్ని స్వీకరించగలిగారు. ఆలయం వద్ద పురుషుల కోసం, మహిళల కోసం వేర్వేరుగా ఆరు కౌంటర్లు ఏర్పాట్లు చేశారు. శేష్ మహల్ రోడ్డు, మసీదు సెంటర్ ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన ప్రాంతంలో ఇదే తరహా పద్దతులను పాటించారు. వలంటీర్లు, భక్తులు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా అమ్మవారి ప్రత్యేక రూపాన్ని నైవేద్య పదార్ధాలతో ఆలయం ముందు తయారుచేశారు. జాతర మహాకుంభ నివేదనతో పరిపూర్ణమైంది.


