జంగారెడ్డిగూడెం: గుర్వాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో గురువారం హుండీ ఆదాయాన్ని లెక్కించారు. జిల్లా దేవాదాయ శాఖ అధికారి కూచిపూడి శ్రీనివాస్ పర్యవేక్షణ, పోలీస్, రెవెన్యూ అధికారుల సమక్షంలో కేవీవీ బ్యాంక్ సిబ్బంది, ఆలయ సిబ్బంది హుండీలను తెరచి లెక్కింపు నిర్వహించారు. హుండీల ద్వారా 106 రోజులకు గాను రూ.62,34,432, అన్నదానం హుండీ ద్వారా రూ.92,023 మొత్తం రూ.63,26,455 ఆదాయం లభించినట్లు ఆలయ సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి ఆర్‌వీ చందన తెలిపారు.
జంగారెడ్డిగూడెం: స్థానిక గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం హుండీ లెక్కింపు కార్యక్రమం గురువారం నిర్వహించారు. 80 రోజులకుగాను మొత్తం రూ.11,36,434 లక్షలు ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కలగర శ్రీనివాస్ తెలియజేశారు. జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ వి.సురేష్‌కుమార్ ఆధ్వర్యంలో జరిగిన హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల, మండలి చైర్మన్ అల్లూరి రామకృష్ణ, కన్నా కృష్ణ, కొప్పుల నాగ సురేంద్ర, ముప్పుడి భాను, ప్రియాంక, దివ్య ప్రసన్న, ఆరేపల్లి నాన్ని, అభివృద్ధి కమిటీ సభ్యులు అబ్బిన దత్తాత్రేయ, దండు ధనరాజు, ఫణి, ఏలూరు విజయవాడ రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్, ఇండియన్ బ్యాంక్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
ముదినేపల్లి (కై కలూరు): ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో నిండు చూలాలిపై ఓ కన్నతండ్రి పాశవికంగా దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముదినేపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెదకోమర్రుకు చెందిన పట్టపు సూర్యనారయణకు ఇద్దరు ఆడ పిల్లలు. పెద్ద కుమార్తె శ్రావణి కొన్ని నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. ఆమె ప్రస్తుతం 8 నెలల నిండు గర్భిణి. ప్రేమ వివాహం చేసుకోవడంతో తల్లిదండ్రులతో పాటు చెల్లెలు ప్రవల్లిక సైతం శ్రావణిపై కోపం పెంచుకున్నారు. శ్రావణి తాత ఆంజనేయులు, తండ్రి వెంకట సూర్యనారాయణ పక్కపక్క ఇళ్లలోనే నివసిస్తున్నారు. ఈ క్రమంలో శ్రావణి గర్భవతి కావడంతో తాత ఆంజనేయులు ఆమెను తన ఇంటికి తీసుకువచ్చాడు. ఈ నెల 23న శ్రావణి ఇంటి తలుపు తీస్తుండగా తండ్రి సూర్యనారాయణ ఆమెను కొట్టడానికి రావడంతో భయపడి లోపలికి వెళ్లి తలుపులు వేసుకుంది. ఇంతలో అడ్డువచ్చిన ఆంజనేయులును సైతం సూర్యనారాయణ చితకబాదడంతో శ్రావణి బయటకు రాగా ఆమెను కాలితో కడుపుపై తన్నాడు. తండ్రితోపాటు శ్రావణిపై తల్లి, చెల్లి కూడా దాడి చేశారు. గర్భిణి శ్రావణిని గుడివాడ ఆస్పత్రికి 108లో తరలించారు. తాత ఆంజనేయులు ఫిర్యాదుతో గురువారం కేసు నమోదు చేశారు.


