ద్వారకాతిరుమల: ప్రజలు తమ పొదుపులను సురక్షితంగా పెట్టుబడి పెట్టడానికి పోస్టాఫీస్ పథకాలు అత్యంత విశ్వసనీయమైనవని ఆంధ్రప్రదేశ్ సర్కిల్ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ బీపీ శ్రీదేవి అన్నారు. ఏలూరు పోస్టల్ డివిజన్‌లోని ద్వారకాతిరుమల మండలం ఎం.నాగులపల్లి బ్రాంచి పోస్టాఫీసును గురువారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆ శాఖలో అందిస్తున్న తపాలా సేవలు, వినియోగదారులకు అందుతున్న సదుపాయాలు, పనితీరు అంశాలను సమగ్రంగా సమీక్షించారు. అలాగే భీమడోలు, పూళ్ల, ద్వారకాతిరుమల సబ్ పోస్టాఫీసుల పరిధిలో ఉన్న మొత్తం 15 బ్రాంచ్ పోస్ట్ ఆఫీసుల పనితీరుపై సమీక్ష నిర్వహించి, సేవల మెరుగుదలకు సంబంధించిన పలు సూచనలు చేశారు. అలాగే ఈసీఆర్, ఐసీఆర్ ప్రమాణాల బలోపేతం, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలు, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, బ్రాంచి ఆఫీసుల ఆర్థిక స్థిరత్వంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అలాగే బ్రాంచి పోస్టు మాస్టర్లు వ్యాపారాభివృద్ధి, ఆదాయవృద్ధి, వినియోగదారులకు చేరువయ్యే కార్యక్రమాల్లో చురుకై న పాత్ర పోషించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు పోస్టల్ సూపరింటెండెంట్ ఎస్.విజయ భాస్కర్, అసిస్టెంట్ పోస్టల్ సూపరింటెండెంట్ (హెచ్‌క్యూలు) డి.శ్రీనివాసరావు, కె.శ్రీనివాసరావు, అసిస్టెంట్ సూపరింటిండెంట్ జంగారెడ్డిగూడెం, పోస్టల్ ఇన్‌స్పెక్టర్లు డి.శ్రీకాంత్, యు.చంద్రశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు.


