నేటి నుంచి పొగాకు వేలం ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి పొగాకు వేలం ప్రారంభం

Mar 25 2026 7:08 AM | Updated on Mar 25 2026 7:08 AM

నేటి నుంచి పొగాకు వేలం ప్రారంభం ఇళ్ల స్థలాలు ఇవ్వాలి గ్యాస్‌ ధరలు తగ్గించాలి

జంగారెడ్డిగూడెం: నేటి నుంచి వర్జీనియా పొగాకు వేలం ప్రారంభం కానుంది. ఎన్‌ఎల్‌ఎస్‌ పరిధిలోని ఐదు వేలం కేంద్రాల్లో వేలం ప్రారంభమవుతున్నట్లు రీజనల్‌ మేనేజర్‌ జె.సురేంద్రకుమార్‌ తెలిపారు. గత ఏడాది వేలం ప్రక్రియ రైతులు ఊహించిన దానికంటే రికార్డు స్థాయిని ధరను అందించింది. ఈ సారి పంట పెట్టుబడులు పెరిగాయి. ముఖ్యంగా కౌలు లీజులు పెరగడం, ఎరువులు, పురుగుమందులు తదితర ధరలు కూడా పెరగడంతో ఎక్కువ మొత్తంలో రైతులు వెచ్చించారు. కర్ణాటక మార్కెట్‌ అనుకూలంగా లేకపోవడం, ఉత్పత్తి ఖర్చులు పెరిగిపోవడం, అనుమతించిన 49 మి.కిలోల కంటే అధికంగా పడించడంతో కొంత ఒత్తిడి ఉంది. మొత్తంగా 80 మి.కిలోల పైబడి ఉత్పత్తి రావ చ్చనే అంచనాలు నడుమ ధరపై కూడా రైతులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. గత ఏడాది కేజీ అత్యధిక ధర రూ.456 లభించగా, సరాసరి ధర రూ. 297.50 లభించింది. ప్రస్తుత పరిస్థితిలో ప్రారంభ ధర రూ.350 పైగా రావడంతో పాటు, సరాసరి ధర రూ.320 నుంచి రూ.350 మధ్య వస్తేనే రైతులకు గిట్టుబాటు అవుతుందని వర్జీనియా రైతు సంఘ నాయకులు పేర్కొంటున్నారు. ఎన్‌ఎల్‌ఎస్‌ ఏరియా పరిధిలోని ఐదు వేలం కేంద్రాలైన జంగారెడ్డిగూడెం–1, –2, కొయ్యలగూడెం, గోపాలపురం, దేవరపల్లి కేంద్రాల్లో బుధవారం నుంచి వర్జీనియా వేలం ప్రక్రియ ప్రారంభం కానుంది.

ఏలూరు (టూటౌన్‌): చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా రాష్ట్ర ప్రజలను మోసగించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డేగా ప్రభాకర్‌ ఆరోపించారు. సీపీఐ ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో మండల తహసీల్దార్‌ కార్యాలయం వద్ద మంగళవారం ఆందోళన నిర్వహించి తహసీల్దార్‌కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా డేగా ప్రభాకర్‌ మాట్లాడుతూ.. సూపర్‌ పథకాల అమలు పేరిట ఆర్భాటం చేస్తున్న కూటమి ప్రభుత్వం ఏ లబ్ధిదారుడికి న్యాయం చేసిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో రెండున్నర ఏళ్ళుగా కొత్త రేషన్‌ కార్డులు, పెన్షన్లు ఇవ్వకుండా ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణాల్లో రెండు సెంట్ల ఇంటి స్థలం గ్రామాల్లో మూడు సెంట్ల ఇంటి స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఏలూరు జిల్లా సమితి కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య మాట్లాడుతూ ఎన్నికల సమయంలో రాష్ట్రవ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని విమర్శించారు. 80 శాతం పూర్తయిన టిడ్కో ఇల్లు తక్షణమే పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వాలని, ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి అద్దెను ప్రభుత్వమే భరించాలని డిమాండ్‌ చేశారు.

ఏలూరు (టూటౌన్‌): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్యాస్‌ సకాలంలో సరఫరా చేసే విషయంలో తగు చర్యలు తీసుకోవాలని, పెంచిన గ్యాస్‌ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఎం ఏలూరు నగర కార్యదర్శి పంపన రవికుమార్‌ డిమాండ్‌ చేశారు. స్థానిక సుందరయ్య కాలనీలో ఆ పార్టీ శాఖ ఆధ్వర్యంలో సుందరయ్య గ్రంథాలయం వద్ద కట్టెల పొయిపై వంటచేసి నిరసన తెలిపారు. రవి కుమార్‌ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ప్రజలు గ్యాస్‌ విషయంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని విమర్శించారు. ప్రజలు గ్యాస్‌పై వంటలు చేయడానికి అలవాటు పడిన ఈ తరుణంలో తిరిగి పూర్వకాలానికి తీసుకువెళ్లి కట్టెల పొయ్యిపై వంట చేసే పరిస్థితిని తీసుకువచ్చారని తెలిపారు. చిన్న వ్యాపారస్తులు, రోడ్డు పక్కన హోటల్స్‌ పెట్టుకుని జీవనాన్ని గడుపుతున్న వారు తమ జీవనోపాధిని కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఒకపక్క గ్యాస్‌కు ఏ విధమైన ఇబ్బంది లేదని చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితులు లేవని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement