చింతలపూడి: స్థానిక ఫైర్ స్టేషన్ సెంటర్ వద్ద యుటీఎఫ్ ఆధ్వర్యంలో మంగళవారం ఉపాధ్యాయులు భారీ ధర్నా నిర్వహించారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన ఈ దీక్షలో ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యుటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ పూరేటి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం ఉపాధ్యాయుల పట్ల అవలంభిస్తున్న నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా ఖండించారు. వెంటనే పీఆర్‌సీ కమిషన్ చైర్మన్‌ను నియమించాలని, 29 శాతం ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు, పెన్షనర్లకు పేరుకుపోయిన బకాయిల చెల్లింపుపై స్పష్టమైన రూట్ మ్యాప్ ప్రకటించాలన్నారు. సీపీఎస్ విధానాన్ని తక్షణమే రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న హెల్త్ కార్డులు, మెడికల్ బిల్లుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు. కోవిడ్ సమయంలో ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగ, ఉపాధ్యాయ కుటుంబాలకు కారుణ్య నియామకాలు చేపట్టాన్నారు. రిటైర్ అయిన వారికి రావాల్సిన గ్రాట్యుటీ, ఎర్నడ్ లీవ్, ఎన్‌న్‌క్యాష్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న సరెండర్ లీవుల బకాయిల చెల్లింపునకు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో చింతలపూడి ఎంఈఓ–2 కిరణ్ బాబు, యుటీఎఫ్ జిల్లా కోశాధికారి రంగమోహన్, సీఐటీయు జిల్లా అధ్యక్షులు ప్రసాద్ ప్రసంగించారు. అలాగే జిల్లా వ్యాప్తంగా ఏలూరు, దెందులూరు, ఉంగుటూరు, పోలవరం, కై కలూరు, నూజివీడు నియోజకవర్గాల్లో యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు జరిగాయి.


