ఏలూరు (టూటౌన్): ఏలూరు కలెక్టరేట్‌లో సోమ వారం నిర్వహించిన జిల్లాస్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో 358 అర్జీలు అందాయి. కలెక్టర్ కె.వెట్రిసెల్వి, జేసీ ఎంజే అభిషేక్ గౌ డ, ఇన్‌చార్జి డీఆర్వో భాస్కర్, ఎస్సీ కార్పొరేషన్ ఈ డీ ఎం.ముక్కంటి, సర్వే శాఖ ఏడీ అన్సారీ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రతి అర్జీకి న్యాయమైన పరిష్కారం చూపాలని కలెక్టర్ వెట్రిసెల్వి ఆ దేశించారు. భూ సమస్యలను రెవెన్యూ క్లినిక్‌ల ద్వారా పరిష్కరించుకోవాలని ప్రజలకు సూచించారు. తన పొలాన్ని కౌలుకు ఇచ్చిన రైతు పేరున మార్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని టి.నర్సాపురం మండలం అల్లంచర్లరాజుపాలేనికి చెందిన చొప్ప మధుసూదరనరావు కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. గ్రామంలోని సర్వే నం. 85–2లో ఉన్న 35 సెంట్ల భూమిని సరిహద్దు రైతు శ్రీహరికి కౌలుకు ఇచ్చానని, అయితే రెవెన్యూ అధికారుల సహకారంతో శ్రీహరి తన పొలాన్ని కాజేశారని ఫిర్యాదు చేశారు. తహసీల్దార్, వీఆర్వో, ఆర్‌ఐలు శ్రీహరితో కుమ్మక్కయ్యారని చర్యలు తీసుకోవాలని కోరారు.


