కక్ష గట్టి.. కూలగొట్టి..!
సొసైటీలో దా‘రుణం’
సాక్షి టాస్క్‌ఫోర్స్: రాజకీయ నేతలు చెప్పినట్టు వినలేదనే అక్కసు కావచ్చు.. తమ పార్టీకి చెందినవాడు కాదనే ధీమా కావచ్చు.. తమపై ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేశారనే కోపం కావచ్చు.. కారణం ఏదైనా ఏలూరు నియోజకవర్గంలోని ఒక బడా నేతకు ఆగ్రహం తెప్పించింది. ఇంకేముంది నగరంలోని అధికారులు రంగ ప్రవేశం చేశారు. ఎటువంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా ఇంటి ముందు ఉన్న ర్యాంపును, గోడ పక్కన ఉన్న పూల కుండీలను తొలగింపజేశారు. స్థానిక న్యూ అశోక్ నగర్‌లోని లయన్స్ క్లబ్ బిల్డింగ్ పక్కన ఉన్న సరెళ్ల రామకృష్ణ నివాసం దీనికి వేదికగా మారింది. ఎప్పుడు ప్రపోజల్ పెట్టారో కూడా తెలియనిచోట కొత్తగా డ్రైనేజీ కడుతున్నామనే సాకుతో శనివారం ఉదయం ధ్వంస రచనకు శ్రీకారం చుట్టారు. బాధితుడు ఎంత గగ్గోలు పెట్టినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. రామకృష్ణ ఫిర్యాదు వెనుక ఒక రిటైర్డ్ పోలీసు అధికారి ఉన్నట్టు గుర్తించి ఆయన్ను సదరు బడా నేత ఇంటికి పిలిపించి మరీ వార్నింగ్ ఇవ్వడం, దుర్భాషలాడటంతో పాటు దాడికి కూడా పాల్పడ్డారని తెలిసింది. పోలీసు శాఖలో పనిచేసిన తనకే రక్షణ లేకపోతే సాధారణ వ్యక్తుల పరిస్థితి ఏమిటంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బెదిరింపులు.. దౌర్జన్యం : సీఎం వివరణ అడగడంతో కోపం పెంచుకున్న బడా నేత తనను ఆయన కార్యాలయానికి పిలిపించి బెదిరించి, దౌర్జన్యానికి దిగినట్టు రిటైర్డ్ పోలీసు అధికారి చెబుతున్నారు. ఈ క్రమంలోనే శనివారం ఉదయం బాధితుడైన సరెళ్ల రామకృష్ణ ఇంటి వద్ద విధ్వంసానికి ఒడిగట్టునట్టు తెలుస్తోంది. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పాలకులే దౌర్జన్యాలకు దిగితే తాము ఎవరికి మొరపెట్టుకోవాలంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ నాయకుల లబ్ధి కోసం అధికారులను అడ్డం పెట్టుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కమిషనర్ వివరణ: నగరపాలక సంస్థ కమిషనర్ వివరణ ఇస్తూ ఆ రోడ్డులో డ్రైనేజీ నిర్మాణం ని మిత్తం రహదారిపైకి వచ్చిన ర్యాంపును తొలగించామని చెప్పారు. కార్పొరేషన్ స్థలంలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తొలగించే అధికారం తమకు ఉందన్నారు.
మాట వినలేదనే కారణంతో ర్యాంపు తొలగింపు
ముందస్తు నోటీసు ఇవ్వకుండా విధ్వంసం
సీఎంఓకు ఫిర్యాదు చేయడమే బాధితుడి తప్పు
రిటైర్డ్ పోలీసు అధికారిపైనా దౌర్జన్యం
ఏలూరులో కక్ష సాధింపుల పర్వం
బాధితుడు రామకృష్ణ గతంలో ఓ ప్రైవేట్ సొ సైటీలో తనకున్న 11 ఎకరాలను తనఖా పెట్టి రుణం తీసుకున్నారు. దీనికి సంబంధించి అప్పట్లో 10 చెక్కులు, 10 ప్రో నోట్లు కూడా ఇచ్చారు. తీసుకున్న అప్పు మొత్తం చెల్లించి తన ఖాళీ చెక్కులు, నోట్లు ఇవ్వాలని కోరారు. అయితే అవి అందుబాటులో లేవని, తర్వాత ఇస్తామని చెప్పి సొసైటీ స భ్యులు చెప్పి పంపించేశారు. అయితే తర్వాత వా టిని కోర్టులో వేరే వ్యక్తులు ఫైల్ చేసి సొమ్ములు డి మాండ్ చేశారని బాధితుడు వాపోతున్నారు. దీనిపై తాను కోర్టును ఆశ్రయించానన్నారు. ఇదిలా ఉండగా తనఖా పెట్టిన భూమిని సదరు ప్రైవేట్ సొసైటీ యజమాని కుమారుడి పేరున మార్పించేసుకుని ప్రస్తుతం భీమడోలు మండలం ఆగడాలలంకలో ఉన్న 11 ఎకరాల భూమిని ఖాళీ చేయాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. ఈ క్రమంలో బాధితునికి అండగా ఓ రిటైర్డ్ పోలీసు అధికారి నిలిచి జరిగిన మొత్తం విషయాన్ని పోలీసులకు, అధికారులతో పాటు సీఎంఓ కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే ఇటీవల ముఖ్యమంత్రి సైతం సదరు బడా నేతను వివరణ అడిగినట్టు సమాచారం.
కక్ష గట్టి.. కూలగొట్టి..!


