గోపాలా..ఈ గోవులను పట్టించుకునే వారే లేరా? | - | Sakshi
Sakshi News home page

గోపాలా..ఈ గోవులను పట్టించుకునే వారే లేరా?

Apr 4 2026 7:55 AM | Updated on Apr 4 2026 7:55 AM

మేత లేక బక్కచిక్కుతున్న ఆవులు

కె.పెంటపాడు బైరాగిమఠంగోశాల వద్ద వింత పరిస్థితి

పెంటపాడు: జిల్లాలో ప్రసిద్ధి చెందిన కె.పెంటపాడు బైరాగిమఠం గోపాలస్వామి ఆలయంలో గోశాలలోని గోవులు మేత లేక అల్లాడుతున్నాయి. ఇక్కడ 150కి పైగా గోవులు ఉంటాయి. వీటి కోసం ప్రత్యేకంగా కాపరి ఉంటున్నా వాటి ఆలనాపాలనా పట్టించుకోవడం లేదు. గత కొన్ని రోజులుగా సమస్య తీవ్రతరమైంది. దీంతో గోపాలా.. మా మోర వినవా అంటూ నిత్యం గోపాలస్వామిని మొర పెట్టుకుంటున్నాయి. అయితే గోవుల సంరక్షణ బాధ్యతలు మాత్రం అధికారులు పట్టించుకోవడం లేదు.

పచ్చగడ్డి ఏదీ?

గతంలో ఆలయ ఆవరణలో ఆవుల కోసం ప్రత్యేకంగా పచ్చగడ్డి పెంచే వారు. గత రెండేళ్లుగా ఆ మేత లేదు. సార్వా ఎండుగడ్డి మాత్రం స్టోరేజీ చేశారు. అదికూడా రక్షణ లేకపోవడంతో కుళ్లిపోయింది. గోశాల చుట్టూ దుర్వాసన వస్తోంది. అక్కడే చెత్త వేయడం వల్ల దోమలు విపరీతంగా పెరిగిపోయాయి. గోశాల వద్ద నిత్యం మందుబాబులు మద్యం తాగుతున్నారు. అక్కడ, పడమర రాజగోపురం వద్ద మద్యం ఖాళీ బాటిళ్లు దర్శనమిస్తున్నాయి. గోవుల కోసం తాగునీరు లేదు. వారానికి ఒక సారి నీరు పోస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. అయితే ఆ నీరు ఎండకు వేడెక్కడంతో గోవులు ముట్టుకోవడం లేదు.

గోశాల చరిత్ర

బైరాగిమఠంలో ఒక గోవు గోపాలుడిని సేవించేందుకు ఆలయం చుట్టూ ప్రదక్షణలు చేసి అలసిపోయి అక్కడే మృతి చెందింది. దీంతో ఆ ఆవు బొమ్మ ఆలయంలో ప్రతిష్టించారు. ఆలయానికి వచ్చే భక్తులు తప్పక ఆవు విగ్రహానికి కూడా పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇంత ప్రాశస్త్యం ఉన్న గోశాలలోని గోవులను పట్టించుకోకపోవడం భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఆలయానికి వేల ఎకరాలు భూమి ఉన్నా గోశాలకు విరాళాలివ్వండి అంటూ ప్రచారాలు చేసుకుంటున్నారే తప్ప వాటిని పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి గోశాల నిర్వహణను సవ్యంగా చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement