గురువులపై సర్కారు కత్తి | - | Sakshi
Sakshi News home page

గురువులపై సర్కారు కత్తి

Mar 1 2026 7:54 AM | Updated on Mar 1 2026 7:54 AM

గురువ

గురువులపై సర్కారు కత్తి

ఆటోమేషన్‌ సరికాదు

దూర ప్రాంతాల్లో విధులు

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ప్రభుత్వ ఉపాధ్యాయులపై చంద్రబాబు ప్రభుత్వం కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తోందని ఉపాధ్యాయ సంఘాలు గళమెత్తుతున్నాయి. అధికారం చేపట్టి 20 నెలలు గడుస్తున్నా తమ సమస్యలను పట్టించుకోకపోగా, పలురకాలుగా వేధింపులకు గురిచేస్తోందని సంఘాల నాయకులు అంటున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు రెసిడెన్షియల్‌ శిక్షణ పేరుతో కనీస వసతులు లేని మారుమూల ప్రాంతాల్లో శిక్షణ ఏర్పాటు చేసి ఉపాధ్యాయుల మృతికి కారణమయ్యిందని ఆవేదన చెందుతున్నారు. అలాగే తాజాగా పదో తరగతి పరీక్షల ఇన్విజిలేషన్‌కు సంబంధించి ఆటోమేషన్‌ విధానంతో ఉపాధ్యాయులకు సమస్యలు తప్పవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

20 నెలలు గడిచినా..

సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం అమలుపై ప్రభుత్వం నోరెత్తడం లేదు. అలాగే పీఆర్‌సీ కమిషన్‌ ఏర్పాటుచేయాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పీఆర్‌సీ కమిషనర్‌ను నియమించగా ఆయన నివేదిక ఇచ్చేలోపు ప్రభుత్వం మారింది. దీంతో ఆయన రాజీనామా చేసేలా ఒత్తిళ్లు పెరిగాయి. చంద్రబాబు సర్కారు కొత్త కమిషనర్‌ను నియమిస్తారని ఉద్యో గ, ఉపాధ్యాయులు ఆశించినా ఇప్పటికీ ఎలాంటి ప్రకటనా లేదు. పీఆర్‌సీ ప్రకటించేలోపు 30 శాతం ఐఆర్‌, పెండింగ్‌ డీఏల విడుదల, బోధనేతర పను ల రద్దు, యాప్‌ల నిర్వహణ కోసం ప్రత్యేక సిబ్బంది నియామకం, ఇన్‌సర్వీస్‌ ఉపాధ్యాయులకు టెట్‌ రద్దు, సంక్షేమ వసతి గృహాల్లో రెగ్యులర్‌ డిప్యూటీ వార్డెన్‌ల నియామకం, 11వ పీఆర్‌సీ బకాయిలు చెల్లింపు, మున్సిపాలిటీ ఉపాధ్యాయులకు అర్బన్‌ డీఐ పోస్ట్‌ మంజూరు వంటి డిమాండ్లతో ఉపాధ్యాయులు ఆందోళనలు నిర్వహిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

ఆటోమేషన్‌ ఎత్తుగడ

రాష్ట్రంలో కార్పొరేట్‌ విద్యా వ్యవస్థకు మేలు చేసేలా చంద్రబాబు సర్కారు ప్రభుత్వ విద్యారంగాన్ని నీరుగార్చేలా కొత్త విధానాలు తీసుకువస్తుందని విద్యారంగ నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో ఇన్విజిలేషన్‌ విధులను ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో పని చేసే ఉపాధ్యాయులకు కూడా అప్పగించాలని నిర్ణయించడమే ఇందుకు నిదర్శనమని అంటున్నారు. ఇదే జరిగితే ప్రమాణాలు లేని విద్యార్థులను కూడా ఉత్తీర్ణులను చేసి ఇంటర్మీడియెట్‌లో చేర్చడం ద్వారా కార్పొరేట్‌ విద్యా వ్యాపారం మరింతగా బలపడుతుందని అంటున్నారు. అధికారాన్ని కేంద్రీకరించి స్థానిక అధికారులతో సంబంధం లేకుండా రాష్ట్రస్థాయిలోనే ఇన్విజిలేటర్లను నియమించడమే ఆటోమేషన్‌ విధా నమని అంటున్నారు. తమకు అనుకూలమైన వా రికి ఇన్విజిలేషన్‌ విధుల్లో నియమించడమే ఎత్తుగడని అనుమానిస్తున్నారు.

‘పది’లంగా పరీక్షలు జరిగేనా?

ఆటోమేషన్‌ విధానంపై ఉపాధ్యాయులు ఆందోళనలు చేపడుతున్నారు. యూటీఎఫ్‌, ఏపీటీఎఫ్‌ వంటి సంఘాలు మండల, డివిజన్‌, జిల్లాస్థాయిల్లో ధర్నాలు నిర్వహించాయి. పదో తరగతి పరీక్షలు దగ్గర పడుతున్న సమయంలో ఉపాధ్యాయుల ఆందోళనలతో నూరు రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు, విద్యార్థులకు పాఠాలు చెప్పడానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇది ఉత్తీర్ణతా శాతంపై పెను ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ఈనెల 16 నుంచి టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభం కానుండగా జిల్లావ్యాప్తంగా 23,242 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. 14,019 మంది ప్రభుత్వ, 9,223 మంది ప్రైవేట్‌ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఉన్నారు.

ఇదేంది గురూ !

20నెలలుగా పరిష్కారం కాని సమస్యలు

కొత్తగా ఆటోమేషన్‌ విధానంతో తిప్పలు

టెన్త్‌ పరీక్షలపై నీలినీడలు

ఫలితాలపై ప్రభావం పడే అవకాశం

త్వరలో జరుగనున్న పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు సజావుగా సాగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఉపాధ్యాయుల డిమాండ్లలో ఆర్థిక బకాయిలే ఎక్కువగా ఉన్నాయి. ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలను విడుదల చేస్తే పరిస్థితి కొంత సర్దుమణుగుతుంది. పబ్లిక్‌ పరీక్షల్లో ఆటోమేషన్‌ విధానం అమలు సరికాదు.

– గెడ్డం సుధీర్‌, వైఎస్‌ఆర్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి

టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలకు సంబంధించి ఇప్పటికే చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్లకు డ్యూటీలు వేశారు. అయితే వారిలో 30 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన వారు కూడా ఉన్నారు. నిబంధనల మేరకు 8 కిలోమీటర్ల పరిధిలో మాత్రమే ఇన్విజిలేషన్‌ డ్యూటీలు వేసేలా చూడాలి.

– గుగ్గులోతు కృష్ణ, ఏపీటీఎఫ్‌ 1938 రాష్ట్ర అకడమిక్‌ కన్వీనర్‌

గురువులపై సర్కారు కత్తి 1
1/2

గురువులపై సర్కారు కత్తి

గురువులపై సర్కారు కత్తి 2
2/2

గురువులపై సర్కారు కత్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement