కలుషిత జలం.. చర్మవ్యాధుల కలకలం
● ప్రజల ఒంటిపై దద్దుర్లు, ఎర్రటి పొక్కులు
● పాలకొల్లు శివారు చిత్రావిచెరువు గట్టు ప్రాంతంలో వైద్య శిబిరం
పాలకొల్లు సెంట్రల్: పాలకొల్లులోని చిత్రావిచెరువు గట్టు ప్రాంతంలో కలుషిత నీటితో ప్రజల ఒంటిపై దద్దుర్లు, ఎర్రటి పొక్కులు రావడం కలకలం రేపింది. తమ ప్రాంతానికి వస్తున్న నీళ్లు నలకలు, పురుగులు, మురుగుగా వస్తున్నాయని కొద్దికాలంగా వీ రంతా ఆవేదన చెందుతున్నారు. సమస్యను అధికారులు, నాయకుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లే దు. అచ్చుగట్లపాలెం, చిత్రావిచెరువు గట్టు శివారు ప్రాంతం పాలకొల్లు శివారు రూరల్ పంచాయతీకి చెందింది కాగా మున్సిపాలిటీలో విలీన ప్రక్రియలో ఉంది. దీంతో పంచాయతీకి సంబంధం లేదనే సమాధానాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రాంత ప్రజలు సమస్యలను స్థానిక మంత్రి దృష్టికి తీసుకువెళ్లగా మీది ఏ బూత్ అనే ప్రశ్నలు రావడంతో నివ్వెరపోయారు.
పది రోజులుగా.. పది రోజులుగా చిత్రావిచెరువు గట్టు శివారున ఉన్న పలువురు మహిళలు, చిన్నారుల ఒంటిపై దద్దుర్లు, ఎర్రని పొక్కులు రాగా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో గురువారం రాత్రి ఎంపీడీఓ, వైద్యాధికారులు వచ్చి సుమారు 60 మందిని పరిశీలించి శుక్రవారం వైద్యశిబిరం ఏర్పాటుచేశారు. మూడు రోజుల వరకూ పంచాయతీ సరఫరా చేసే నీటిని వాడవద్దని సూచించారు. శుక్రవారం మెడికల్ క్యాంపునకు జిల్లా వైద్యాధికారి వచ్చి పరీక్షలు నిర్వహించారు. అలాగే గ్రామీణ నీటి పారుదల శాఖ అధికారులు వచ్చి కలుషిత నీటిని పరిశీలించారు. ట్యాంకులను శుభ్రం చేయించాలని, చిన్న పాటి పరిశుభ్రత చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 24 గంటల్లో నివేదిక వస్తుందని చెప్పారు. ఇది పంచాయతీకి సంబంధం లేదు, ఈ ప్రాంతం మున్సిపాలిటీలో విలీనమయ్యిందని ప్రజాప్రతినిధులు అనగా జిల్లా వైద్యాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు కూడా కూటమి నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆ ప్రజాప్రతినిధులు అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు తెలిసింది.


