మా భూముల జోలికొస్తే ఊరుకోం
కొయ్యలగూడెం: మా భూములు జోలికి వస్తే స హించం, మాతో భేటీలు భరించం అంటూ మంగమతిదేవిపేట, బోడిగూడెం పంచాయతీల రైతు సంఘం పేర్కొంది. నేవీ ఆయుధ డిపో నిర్మాణానికి వ్యతిరేకంగా పోరుబాటలో భాగంగా శనివారం మంగపతిదేవిపేట, బోడిగూడెం గ్రామాల్లో రైతులు తమ వ్యవసాయ పొలాల్లో ప్లకార్డులతో నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇప్పటికే పలుదఫాలుగా ఏలూరులో కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపి కలెక్టర్‌కు వినతిపత్రం అందించినా ప్రజాప్రతినిధులు మాత్రం తమ భూములను లాక్కోవడానికి చూస్తున్నారని మండిపడ్డారు. ఆయుధ డిపో నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని కానీ, అయితే తమకు జీవనాధారమైన ఏడాదికి రెండు పంటలు పండే పచ్చటి పొలాలను వదులుకోవడానికి సిద్ధంగా లేమన్నారు. సమీపంలో వేల ఎకరాల ఫారెస్ట్ భూములు ఉన్నాయని, అక్కడ ఆయుధ డిపో నిర్మించాలని కోరారు. గ్రామాల్లో డిపో ఏర్పాటుచేస్తే ఎకరా, అరెకరం ఉన్న రైతుల జీవితాలు నాశనమవుతాయని, తరతరాలుగా భూమిని నమ్ముకున్న ఉన్న తాము ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేశారు. మంగపతిదేవిపేట, బోడిగూడెం, బర్కెట్‌నగర్, ఊట్లగూడెం గ్రామాల్లో బృందాల వారీగా 200 మందికి పైగా రైతులు ఆందోళనల్లో పాల్గొన్నారు.


