నూజివీడుకు వరం కేంద్రీయ విద్యాలయం
● గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే స్థలం కేటాయింపు
● మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు
నూజివీడు: నూజివీడులో కేంద్రీయ విద్యాలయాన్ని ఏప్రిల్ నుంచి ప్రారంభించనున్నారని, ఏడెకరాల స్థలాన్ని అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అన్నారు. నూజివీడులో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేంద్రీయ విద్యాలయం గురించి గత ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి స్థలాన్ని కేటాయించాలని కోరానన్నారు. దీంతో జగన్ కేబినేట్‌లో పెట్టి ఆమోదించి 2022 మార్చి 17న ట్రిపుల్‌ఐటీకి సమీపంలోని సర్వే నం.483–5బీ1లో ఏడెకరాల స్థలాన్ని కేటాయించారన్నారు. నూజివీడు కు కేంద్రీయ విద్యాలయం రావడం ఈ ప్రాంత విద్యార్థులకు వరమని, దీని కోసం తాను 2020 నుంచి హైదరాబాద్, ఢిల్లీలోని కార్యాలయాల చుట్టూ పలుమార్లు తిరిగానన్నారు. తరగతులు నిర్వహణకు పట్టణంలోని ఎంప్లాయీస్ కాలనీలో రూ.80 లక్షల వ్యయంతో 16 గదులను రెండున్నరేళ్ల క్రితమే సిద్ధం చేశామన్నారు. ప్రభుత్వం మారడంతో కేంద్రీయ వి ద్యాలయం ప్రారంభం ఆలస్యమైందని, లేకుంటే గతేడాదే ప్రారంభమై ఉండేదన్నారు. ప్ర స్తుతం ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు తరగతులు ప్రారంభమవుతాయని, ఒక్కో తరగతిలో 40 మంది విద్యార్థులు ఉంటారన్నారు. కేంద్రీయ విద్యాలయం కోసం తనతో పాటు కృషిచేసిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.


