వైద్య,ఆరోగ్యశాఖలోఅవకతవకలు
● మల్టీ పర్పస్ ఆరోగ్య కార్యకర్తల నియామకాల్లో గోల్‌మాల్
● అనర్హులతో జాబితా తయారుచేసి హడావుడిగా విడుదల
ఏలూరు టౌన్ : ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో మల్టీ పర్సస్ ఆరోగ్య కార్యకర్తల (ఎంపీహెచ్‌డబ్ల్యూ) పునర్ నియామకాల్లో అధికారులు అనేక అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అర్హులకు అన్యాయం చేస్తూ... అనర్హులతో జాబితా హడావుడిగా విడుదల చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఒక్కో ఉద్యోగానికి ఎంత మొత్తంలో సొమ్ములు దండుకున్నారో? అని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను సైతం తోసిరాజని.. పోస్టులు అమ్మేసుకున్నారనే అభిప్రాయం ఉద్యోగుల్లో నెలకొంది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నిర్లక్ష్యంతో అర్హులు ఉద్యోగాలకు దూరం కావాల్సి వస్తోందనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ నేతలు అధికారుల తీరుపై ఆందోళనకు దిగారు.
రాష్ట్ర ప్రభుత్వం 2013లో రాష్ట్రంలో సుమారు 1200 మందికి కాంట్రాక్ట్ విధానంలో ఎంపీహెచ్‌డబ్ల్యూ (ఎం)గా ఉద్యోగాలు కల్పించారు. దీనిలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో సుమారు 104 మంది ఉద్యోగాలు పొందారు. అప్పటి నుంచి వీరంతా రెగ్యులర్ చేయాలంటూ ప్రభుత్వాలను కోరుతూ వస్తున్నారు. తెలంగాణ హైకోర్టు తీర్పుతో కాంట్రాక్ట్ సిబ్బందిని ఉద్యోగాల నుంచి తొలగించారు. తమకు న్యాయం చేయాలంటూ ఉద్యోగులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2025 అక్టోబర్ 9న సుప్రీంకోర్టు ఉద్యోగులకు అనుకూలంగా తీర్పు చెబుతూ తొలగించిన వారికి ఉద్యోగాలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం తీర్పుతో రాష్ట్ర ప్రభుత్వం పునర్ నియామకాలకు ఉత్తర్వులు జారీ చేసింది.
జాబితాలో లేని వ్యక్తులకు ఉద్యోగాలా?
ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలోని 104 మంది మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్స్(మేల్) ఉద్యోగాలు కోల్పోయారు. వీరిలో ప్రస్తుతం 86 మంది ఎంపీహెచ్‌డబ్ల్యూ ఉద్యోగులు ఉండగా... హడావుడిగా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు 69 మందితో ఒక జాబితా తయారు చేసి ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు సిద్ధపడింది. ఈ జాబితా తప్పులతడకగా ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సుప్రీం తీర్పు ఆధారంగా, ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా... ఏలూరు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా ఉద్యోగ నియామకాలు చేపట్టారనే విమర్శలు వస్తున్నాయి. 2013లో నియామకం పొందిన 104 మంది ఉద్యోగుల జాబితా వైద్య ఆరోగ్యశాఖలో ఉందా ? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. నూతనంగా ఉద్యోగాలకు ఎంపిక చేసిన జాబితాలో జీవోలో లేని వ్యక్తులకు సైతం ఉద్యోగాలు ఇచ్చేందుకు సిబ్బంది సిద్ధపడడంపై ఆరోపణలు వస్తున్నాయి.
జూనియర్ల ఎంపికపై అనుమానాలు
ఎంపీహెచ్‌డబ్ల్యూ(ఎం) కాంట్రాక్ట్ ఉద్యోగుల పునర్‌నియామకాల్లో జూనియర్లను ఉద్యోగాలకు ఏవిధంగా ఎంపిక చేస్తారనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. అనర్హులు, జూనియర్లను ఎంపిక జాబితాలో పెట్టటం వెనుక భారీ అవినీతి జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది అవగాహన రాహిత్యం, రికార్డులు లేకపోవటంతో ఇష్టారాజ్యంగా చేస్తున్నారని చెబుతున్నారు.
జీవోకు విరుద్ధంగా ఎంపిక
సుప్రీం కోర్టు తీర్పు ఆధారంగా విడుదల చేసిన ఉత్తర్వులకు విరుద్ధంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో నియామకాలు చేసేందుకు సిబ్బంది సిద్ధపడటంపై ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు వై.మోహనరావు, ఏలూరు జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, ఏలూరు జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు జే.గోవిందరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం వద్ద సోమవారం ఆందోళనకు దిగారు. ఎంపిక జాబితాను వెంటనే సరిచేసి అర్హులైన 86 మందికి ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జూనియర్లు, అనర్హులకు ఉద్యోగాలు ఏ విధంగా కల్పిస్తారంటూ ప్రశ్నించారు. సుప్రీంకోర్టు తీర్పును, ప్రభుత్వ ఉత్తర్వులను సైతం పక్కనబెట్టి ఎంపిక జాబితా సిద్ధం చేయడంపై సందేహాలు వ్యక్తం చేశారు. దీనిపై సమగ్ర విచారణ చేసి అర్హులకు న్యాయం చేయాలని కోరారు.


