చిత్తడి నేలల పరిరక్షణ అందరి బాధ్యత
కై కలూరు: చిత్తడి నేలలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాజమండ్రి సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు బీఎన్‌ఎన్.మూర్తి చెప్పారు. వరల్డ్ వైడ్ ఫండ్(డబ్ల్యూడబ్ల్యూఎఫ్), అటవీశాఖ సంయుక్తంగా ఆటపాక పక్షుల కేంద్రంలో ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం సోమవారం నిర్వహించింది. నేషనల్, జాగృతి, ఆక్స్‌ఫర్డ్, ఏలూరు పీపుల్ ఉడ్స్, శృంగవరప్పాడు, వడాలి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు చెందిన 200 మంది విద్యార్థులు హాజరయ్యారు. డబ్ల్యూడబ్ల్యూఎఫ్ స్టేట్ డైరెక్టర్ ఫరిదా టంపల్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్య అతిథి అటవీశాఖ సీసీఎఫ్ మూర్తి మాట్లాడుతూ విదేశీ పక్షులు 30,000 కిలోమీటర్లు ప్రయాణించి శీతాకాలంలో ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం కొల్లేరు చిత్తడి నేలలే అన్నారు. ప్రస్తుతం కొల్లేరులో 40 లక్షల నుంచి 50 లక్షల పక్షులు ఉన్నాయన్నారు. డబ్ల్యూడబ్ల్యూఎఫ్ స్టేట్ డైరెక్టర్ ఫరిదా టంపల్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు తడి నేలలు – సంప్రదాయ జ్ఞానం, సాంస్కృతిక వారసత్వాన్ని జరుపుకోవడం అనే నినాదంతో జరుగుతున్నాయన్నారు. జిల్లా అటవీశాఖ అధికారిణి బి.విజయ కొల్లేరులో జీవవైవిద్యం గురించి అందరూ తెలుసుకోవాలన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో ఫారెస్టు రేంజర్ రామలింగాచార్యులు, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ లీడ్ పార్టనర్ బీఎస్‌ఎం.శ్రీనివాస్, నిర్వాహకులు ఎంఎస్.తిరుమలేశ్వరరావు, శశాంక్, ఇన్‌చార్జి డీఆర్వో రాంబాబు, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, ఫారెస్టు సిబ్బంది హాజరయ్యారు.
ఆటపాక పక్షుల కేంద్రంలో చిత్తడి నేలల దినోత్సవం
చిత్తడి నేలల పరిరక్షణ అందరి బాధ్యత


