కనుల పండువగా చందనోత్సవం | - | Sakshi
Sakshi News home page

కనుల పండువగా చందనోత్సవం

Feb 3 2026 7:37 AM | Updated on Feb 3 2026 7:37 AM

కనుల పండువగా చందనోత్సవం

కనుల పండువగా చందనోత్సవం

ద్వారకాతిరుమల: ఐఎస్‌ జగన్నాథపురంలోని సుందరగిరిపై కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామికి చందనోత్సవాన్ని సోమవారం కనుల పండువగా నిర్వహించారు. ఈ వేడుకతో ఉగ్ర రూపంలో ఉన్న నారసింహుడు చందన లేపంతో సేదతీరారు. ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయానికి దత్తత దేవాలయమైన ఈ ఆలయంలో భీష్మ ఏకాదశి పర్వదినం ప్రారంభమైన స్వామివారి దివ్య కల్యాణ మహోత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా తెల్లవారుజామున ఆలయంలో నిత్య హోమాలు, మూలమంత్ర హవనాలు జరిగాయి. అనంతరం స్వామి, అమ్మవార్లకు పంచామృత అభిషేకాలను ఆలయ అర్చకులు, పండితులు ఘనంగా నిర్వహించారు. ఆ తరువాత స్వామి మూలవిరాట్‌కు చందన మహోత్సవాన్ని వేద మంత్రోచ్ఛరణలతో పండితులు వైభవంగా నిర్వహించారు. ఉగ్రరూపంలో ఉండే లక్ష్మీనారసింహుడిని శాంతింపజేసేందుకు జరిపిన ఈ ఉత్సవాన్ని వీక్షించిన భక్తులు పరవశించారు. పాలు, పెరుగు, నెయ్యి, పంచదార, నీరు, తేనెతో ముందుగా స్వామిని అభిషేకించారు. మహా పూర్ణాహుతి, కలశోద్వాసన, అపబృదం, ధ్వజ అవరోహణ కార్యక్రమాలు నేత్రపర్వంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఆలయ ఈఓ యర్రంశెట్టి భద్రాజీ, ఏఈఓ రమణరాజు తదితరులు పాల్గొన్నారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించి, తీర్ధప్రసాదాలను స్వీకరించారు. పెద్ద ఎత్తున మహిళా భక్తులు సుందరగిరిపై పాలపొంగళ్లను వండి స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు. మంగళవారం స్వామివారికి జరిగే ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, శ్రీపుష్ప యాగోత్సవంతో ఉత్సవాలు పరిసమాప్తం అవుతాయని ఈఓ భద్రాజీ తెలిపారు.

సుందరగిరిపై అట్టహాసంగా వేడుక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement