పంచాయతీ అభివృద్ధి అధికారులకు శిక్షణ తరగతులు
ఏలూరు(మెట్రో): గ్రామస్థాయిలో వివిధ ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంలో పంచాయతీ అభివృద్ధి అధికారులదే కీలక పాత్ర అని జిల్లా ప్రజా పరిషత్ సీఈవో ఎం.శ్రీహరి పేర్కొన్నారు. సోమవారం ఏలూరులోని సోషల్ సర్వీస్ ట్రైనింగ్ సెంటర్‌లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని గ్రేడ్ 4, 5 పంచాయతీ అభివృద్ధి అధికారులకు రిఫ్రెషర్ ట్రైనింగ్ కార్యక్రమాలను జెడ్పీ సీఈఓ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య పంచాయతీ అభివృద్ధి అధికారులు వారధి వంటివారని ప్రజలకు ప్రభుత్వ సేవలను సకాలంలో సమర్ధవంతంగా అందించవల్సిన బాధ్యత పంచాయతీ అభివృద్ధి అధికారులదేనని తెలిపారు. జిల్లా ట్రైనింగ్ మేనేజర్ గుర్రాల ప్రసంగి రాజు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ పరిపాలన సమర్ధవంతంగా జరగాలంటే ప్రతీ పంచాయతి అభివృద్ధి అధికారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న వివిధ శిక్షణ కార్యక్రమాలలో నేర్చుకొని పరిపాలన అంశాలపై పట్టు సాధించాలన్నారు.


