నగరంలో జాతర సందడి
● నేడు పడమర వీధి గంగానమ్మ జాతర
● వివిధ శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): నగరంలో మరోసారి జాతర సందడి నెలకొంది. గత ఆదివారం నగరంలోని తూర్పువీధి, దక్షిణపు వీధి, పవర్‌పేట, లక్ష్మీవారపు పేట, ఆదివారపు పేట ప్రాంతాల్లో నిలిపిన అమ్మవార్ల జాతర నిర్వహించి సోమవారం అమ్మవారికి వీడ్కోలు పలికారు. ఈ ఆదివారం నగరంలోని పడమర వీధి శ్రీ గంగానమ్మ జాతర మహోత్సవం నిర్వహించడానికి కమిటీ ప్రతినిధులు ఏర్పాట్లు చేశారు.
నేడే గంగానమ్మ జాతర మహోత్సవం
పడమర వీధి శ్రీ గంగానమ్మ అమ్మవారి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే అమ్మవారి మేడల వద్ద ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించడానికి వివిధ మార్గాల్లో దర్శనం క్యూలైన్లు అందుబాటులోకి తెచ్చారు. సుమారు లక్ష మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని కమిటీ ప్రతినిధులు అంచనా వేస్తున్నారు. వచ్చిన వారందరికీ అమ్మవారికి దర్శనం కల్పించే దిశగా చర్యలు చేపట్టారు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఉచిత దర్శనమనేదే లేకుండా సామాన్య భక్తుల వద్ద నుంచి దర్శనం నిమిత్తం టిక్కెట్టు పెట్టి రూ. 20 రూపాయలు వసూలు చేయనున్నట్టు ఇప్పటికే కమిటీ ప్రతినిధులు ప్రకటించారు.
నగర ప్రజలకు దర్శనమిచ్చిన కొర్లబండి
జాతర ముగిసిన అనంతరం అమ్మవారిని సోమవారం ఊరి పొలిమేరలకు సాగనంపుతారు. కొర్ల బండిని నగర ప్రజల సందర్శనార్థం పడమర వీధి జాతర కమిటీ సభ్యులు రెండు రోజులు ముందుగానే శనివారం నగరంలో ప్రధాన రహదారుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా కొర్లబండిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు.
ప్రత్యేక ఏర్పాట్లు
ఆదివారం అమ్మవార్లకు నైవేద్యం సమర్పించడానికి, దర్శించుకోవడానికి వచ్చే భక్తుల సౌకర్యార్ధం వివిధ శాఖలు సమన్వయం చేస్తున్నాయి. రెడీమేడ్ మరుగుదొడ్లు సిద్ధం చేశారు. పారిశుద్ధ్యం కోసం బృందాలను ఏర్పాటు చేశాారు. జాతర ప్రాంతంలో విద్యుత్ ప్రమాదాలు జరుగకుండా అందుబాటులో ఉండేలా ఈపీడీసీఎల్ ఎస్‌ఈ ఆదేశాలిచ్చారు. ట్రాఫిక్ నియంత్రణకు ప్రజలకు ట్రాఫిక్ మళ్ళింపుపై సమాచారం ఇస్తున్నారు. ఈ మేరకు ఐజీ జీవీజీ అశోక్ కుమార్, ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ప్రత్యక్ష పర్యవేక్షణ చేస్తున్నారు.
తెల్లవారుజాము నుంచే నైవేద్యాలు
పడమర వీధి శ్రీ గంగానమ్మ అమ్మవారికి నైవేద్యాలు సమర్పించడానికి భక్తులు లక్ష మందికి పైగా వస్తారని అంచనా వేయడంతో భక్తుల తాకిడిని ఎదుర్కోవడానికి తెల్లవారుజామున 2.30 గంటల నుంచే నైవేద్యాలు సమర్పించే వెసులుబాటు కల్పించారు. జాతరను పురస్కరించుకుని బంధుమిత్రులకు విందు భోజనాలు ఏర్పాటు చేసుకున్న నగర ప్రజలు వారికి సమయానికి భోజనాలు అందించాలంటే అమ్మవారికి తొందరగా నైవేద్యం సమర్పిస్తే అంత తొందరగా ఇతర పనులు చేసుకునే అవకాశం ఉంటుందనే తెల్లవారుజామునుంచే భక్తులు దర్శనం కోసం పొటెత్తే అవకాశం ఉంది.
నగరంలో జాతర సందడి
నగరంలో జాతర సందడి


