సమన్వయంతోనే ప్రమాదాల నివారణ
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రహదారి నియమాలను పాటించడంతో పాటుగా అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతోనే రహదారి ప్రమాదాల నివారణ సాధ్యమని అడిషినల్ ఎస్పీ నక్కా సూర్య చంద్రరావు అన్నారు. శనివారం సీఆర్‌రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో రవాణా శాఖ నిర్వహించిన రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లా డుతూ ప్రతి ఒక్కరు రహదారి నియమాలు పాటిస్తూ సురక్షితంగా గమ్యానికి చేరుకోవాలన్నారు. ఆర్టీవో ఎస్.బాలేందు శేఖర్ మాట్లాడుతూ ప్రమాదాల సంఖ్యను తగ్గించడంలో ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. గత ఏడాది జిల్లాలో 760 రహదారి ప్రమాదాలు జరగ్గా.. 300 మంది చనిపోయారని, 430 మందికి గాయాలయ్యాయన్నారు. హెల్మెట్ తప్పక ధరించాలన్నారు. కార్యక్రమంలో 3 టౌన్ సీఐ కోటేశ్వరరావు, ఎస్‌ఐ రాంబాబు, వాహన తనిఖీ అధికారులు రమేష్ బాబు, జీ.ప్రసాదరావు, ఎన్‌డీ విఠల్, జమీర్, సురేష్, జగదీశ్, స్వామి, నెహ్రు, కళ్యాణి, ప్రజ్ఞ తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఈ నె 18 నుంచి టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సులైన డ్రాయింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ (లోయర్, హయ్యర్ గ్రేడ్) పరీక్షలు జిల్లాలో నిర్వహించనున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. టైమ్ టేబుల్ సంబంధిత వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్టు తెలిపారు.
ఏలూరు(మెట్రో): గిరిజన ప్రాంతాలలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకుంటానని కలెక్టర్ కె.వెట్రిసెల్వి హెచ్చరించారు. కలెక్టరేట్‌లోని గౌతమీ సమావేశపు హాలులో శనివారం సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ కార్యక్రమాలపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ప్రధానమంత్రి జన్ మన్ యోజన, తదితర కార్యక్రమాల ద్వారా మారుమూల ప్రాంతాలలోని ప్రజలకు గృహాలు, తాగునీరు, రోడ్లు, విద్యుత్, విద్య, ఆరోగ్య సదుపాయాలు కల్పనకు నిధులు మంజూరు చేసిందని, వాటికి సంబందించిన పనులను మార్చి నెలాఖరు నాటికి పూర్తిచేసి, నిధులు పూర్తిస్థాయిలో వినియోగించాలన్నారు. గ్రామీణ నీటి సరఫరా పథకం ద్వారా 86 పనులు మంజూరుకాగా, 78 పనులు పూర్తయ్యాయని, మిగిలినవి 15 రోజులలో పూర్తిచేయాలన్నారు. గిరిజన ప్రాంతాలలోని 86 గ్రామాలకు 81 గ్రామాలలో విద్యుత్ సౌకర్యం అందించారని, మిగిలిన 5 గ్రామాలలో విద్యుత్ సౌకర్యం పనులు పూర్తి చేయాలన్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా ఒకేషనల్(బ్రిడ్జ్ కోర్సు) విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షల 5వ రోజు మొత్తం 503 మంది హాజరయ్యారు. జిల్లాలోని 8 పరీక్షా కేంద్రాల్లో ఉదయం పరీక్షలు నిర్వహించలేదు. మధ్యాహ్నం పరీక్షలకు 556 మందికి 503 మంది హాజరు కాగా 53 మంది గైర్హాజరయ్యారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని, మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని ఇంటర్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి యోహాను తెలిపారు.నేటి నుంచి జనరల్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం కానున్నాయని ఒక ప్రకటనలో తెలిపారు.
ఏలూరు (మెట్రో): కోకో రైతుల సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం ద్వారా ఉద్యాన శాఖ నిర్వహిస్తున్న కోకో కాంక్లేవ్ 2026 రెండో రోజు జరిగింది. ఏలూరులో జరుగుతున్న ఈ కార్యక్రమానికి వ్యవసాయ, అనుబంధ శాఖల స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాజశేఖర్, ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ డైరెక్టర్ కె.శ్రీనివాసులు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ కోకో అభివృద్ధి కోసం చర్యలు, కోకో గింజల ప్రాసెసింగ్ రాయితీలపై వివరించారు. డా. చలపతిరావు, విశ్రాంత శాస్త్రవేత్త కాళిదాస్‌లు కోకోలో చీడ పీడల లక్షణాలు, యాజమాన్య పద్ధతులు వివరించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వివరాలు, రైతులకు కావలసిన సదుపాయాలు గురించి ఇష్టాగోష్టి నిర్వహించారు.


