రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువు
ముదిరాజ్ రాష్ట్ర అధ్యక్షుడు కోమటి విష్ణువర్థన్
ఏలూరు టౌన్: రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని.. మాజీ మంత్రి విడుదల రజనీపై దాడులకు పాల్పడడం దుర్మార్గమని, కూటమి పాలనలో ప్రజలు తీవ్ర కష్టాల్లో ఉన్నారని వైఎస్సార్‌సీపీ ముదిరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కోమటి విష్ణువర్థన్ ముదిరాజ్ విమర్శించారు. ఏలూరులోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మాజీ మంత్రి రజనీపై జరిగిన దాడిపై స్పందిస్తూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి మహిళలకు రక్షణ లేదనీ, దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు, అఘాయిత్యాలు, ఆఖరికి మాజీ మంత్రులకు సైతం భద్రత లేని దుస్థితి రాష్ట్రంలో నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రిపై దాడులు చేయటం బాధాకరమని, ఇలాంటివి విరమించుకోకుంటే తీవ్ర పరిణామాలు తప్పవన్నారు. పోలీసులు సైతం కూటమికి కొమ్ము కాయటం చూస్తే రాష్ట్రంలో చట్టం పనిచేస్తుందా అనే అనుమానం వస్తుందన్నారు. మాజీ బీసీ మహిళ మంత్రిని అవమానిస్తే ప్రభుత్వం చోద్యం చూస్తోందనీ, ఇక సామాన్య మహిళల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. సమావేశంలో కై కలూరు నియోజకవర్గం ప్రచార విభాగం అధ్యక్షుడు పాము వీరవెంకట రవికుమార్, సోషల్ మీడియా ఉపాధ్యక్షుడు మణిమాల రాజేష్, మండవల్లి మండల పంచాయతీరాజ్ ఉపాధ్యక్షుడు పెరుమాళ్ళ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


