ఉద్యోగుల బకాయిలు చెల్లించాలి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రాష్ట్రంలో ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులకు రూ. 30 వేల కోట్ల బకాయిలను వెంటనే చెల్లించే ఏర్పాటు చేయాలని యూటీఎఫ్ నాయకులు ఎమ్మెల్యే బడేటి చంటిని కోరారు. ఈ మేరకు శనివారం ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసిన యూటీఎఫ్ నాయకులు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రం సమర్పించారు. యూటీఎఫ్ నాయకులు మాట్లాడుతూ పీఆర్‌సీపీకి కొత్త కమిషనర్‌ను ఇంతవరకు నియమించలేదన్నారు. కొత్త పీఆర్‌సీ అమలు చేసేవరకు ఐఆర్ మంజూరు చేయాలని కోరారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు 3 సంవత్సరాలుగా సరెండర్ లీవులు చెల్లించడం లేదని, 4 డీఏలు పెండింగ్‌లో ఉండగా ఒక డీఏ మాత్రమే ఇచ్చారన్నారు. రాష్ట్రంలో అర్హులైన ఉద్యోగ, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలు చేయాల్సి ఉందన్నారు. సానుకూలంగా నిర్ణయాలు తీసుకొనకపోతే సమస్యల పరిష్కారం నిమిత్తం ఉద్యమించక తప్పదని, ఫిబ్రవరి 17న ‘చలో విజయవాడ’ కార్యక్రమం నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.సుభాషిని, రవికుమార్ రుద్రాక్షి తదితరులు ఉన్నారు.


