బలివే ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు
నూజివీడు: మహాశివరాత్రిని పురస్కరించుకుని వచ్చేనెల 15న జరిగే బలివే ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న ఆదేశించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం మహా శివరాత్రి ఉత్సవాలపై అధికారులతో సమీక్షించారు. ఆలయ పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఉండాలని, దాదాపు లక్ష మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి తోపులాటలు జరగకుండా చూడాలన్నారు. ఆలయ పరిసరాల్లో దుకాణాలు పెట్టనీయొద్దని, కనీసం 500 మీటర్ల దూరం పాటించాలన్నారు. తమ్మిలేరులో భక్తులు స్నానాలాచరించాల్సి ఉన్న నేపథ్యంలో తమ్మిలేరులో నీటి ప్రవాహంపై నివేదిక ఇవ్వాలన్నారు. ఆరోగ్య శిబిరాలు, పారిశుద్ధ్యంపై సూచనలిచ్చారు. తిరునాళ్లలో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేస్తున్నారని, జెయింట్‌వీల్, ఇతర వినోదం కలిగించే పరికరాల ఫిట్‌నెస్‌ను పరిశీలించాలన్నారు. అధికారులంతా సమన్వయంతో ఉ త్సవాలను విజయవంతం చేయాలని కోరారు. డీ ఎస్పీ కేవీవీఎన్‌వీ ప్రసాద్, సీఐ కొప్పిశెట్టి రామకృష్ణ, ఆలయ ఈఓ పామర్తి సీతారామ య్య, ఎస్సై మేడిబోయిన చిరంజీవి, ఇన్‌చార్జి ఎంపీడీఓ బసవరాజు సత్యనారాయణ పాల్గొన్నారు.


