రోడ్డుపై ఒట్టు.. నాణ్యత తీసికట్టు
కాంట్రాక్టు కంపెనీనే పనులు చేస్తోంది
నూజివీడు: లక్షలాది రూపాయల ప్రజాధనంతో వేసిన సిమెంట్ రోడ్డుకు ఏడాది కాలంలోనే మూడో సారి మరమ్మతులు నిర్వహిస్తున్న ఘనత చంద్రబాబు సర్కారుకే సాధ్యం. బహుశా సిమెంట్ రోడ్డుకు మరమ్మతుల పనులు రాష్ట్రంలో ఎక్కడా జరిగి ఉండవు. తారు రోడ్డుకంటే ఎక్కువ కాలం మన్నుతుందనే ఉద్దేశంతో తారురోడ్డు నిర్మాణానికి అయ్యే వ్యయంలో రెట్టింపు వ్యయమవుతున్నా సిమెంట్ రహదారులను నిర్మిస్తున్నారు. అయితే నూజివీడు పట్టణంలోని విస్సన్నపేట రోడ్డులో పెట్రోలు బంకుల సమీపంలో ఆర్‌అండ్‌బీకి చెందిన సిమెంట్ రహదారికి మూడోసారి మరమ్మత్తులు చేస్తున్నారు. ఈ సిమెంట్ రహదారికి గతేడాది ఫిబ్రవరిలో నితిన్ సాయి కనస్ట్రక్షన్ కంపెనీ నిర్మించింది. రూ.60 లక్షలతో 20 మీటర్ల వెడల్పున, 200 మీటర్ల పొడవునా 9 అంగుళాల మందంతో సిమెంట్ రోడ్డును నిర్మించారు. అయితే సిమెంట్ రోడ్డు నిర్మాణం జరిగిన తరువాత క్యూరింగ్ పీరియడ్ ముగిసిన అనంతరం వాహనాల రాకపోకలను అనుమతించిన నెల రోజుల్లోపే రోడ్డు దారుణంగా ధ్వంసమైంది. రోడ్డు నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలపై అప్పట్లో పట్టణ ప్రజల్లో తీవ్ర చర్చ జరిగింది. అయితే అప్పటినుంచి అప్పుడప్పుడూ సిమెంట్ లేచిపోయి కంకర బయటపడిన చోటల్లా సంబంధిత కాంట్రాక్టర్‌తో సిమెంట్‌తో ప్లాస్టింగ్ చేయిస్తూ వచ్చారు. అలా చేసినప్పటికీ చేసిన ప్లాస్టింగ్ సైతం వాహనాల రాకపోకలకు లేచిపోయి మళ్లీ కంకర బయటపడుతోంది. కనస్ట్రక్షన్ కంపెనీ మంత్రి తనయుడిది కావడంతో ఆర్‌అండ్‌బీ అధికారులు ఏంచేయాలో పాలు పోక తలలు పట్టుకున్నారు. సిమెంట్ రోడ్డుకు నిర్మించిన అప్రోచ్ రోడ్డు సైతం గుంతలు పడుతూనే ఉండేది. ఈ గుంతల్లో పాత గృహాలను కూల్చగా వచ్చిన రాళ్లు, మట్టిని పోసి పూడుస్తూ వచ్చారు. సిమెంట్ రోడ్డు అధ్వానంగా మారడం మంత్రికి రాజకీయంగా డ్యామేజీని తెచ్చిపెట్టింది.
తాజాగా సిమెంట్ రోడ్డు నిర్మాణం
ఎన్నిసార్లు మరమ్మతులు చేసినా సిమెంట్ రోడ్డుపై గుంతలు పడుతుండటంతో ఎట్టకేలకు కాంట్రాక్ట్ కంపెనీ మళ్లీ మూడంగుళాల మందంతో దానిపైన సిమెంట్ రోడ్డును నిర్మిస్తోంది. ఇనుప ఊసలతో మూస కట్టి కాంక్రీట్‌ను పోస్తున్నారు. ఈ పనులు గురువారం ప్రారంభమయ్యాయి. ఆర్‌అండ్‌బీ అధికారులు దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్నా రు. మళ్లీ సిమెంట్ రోడ్డు పోస్తుండటంతో పట్టణ ప్రజలతో పాటు రాజకీయ వర్గాలు సైతం ఆసక్తిగా పరిశీలిస్తున్నాయి.
ఏడాదిలోనే మూడోసారి
సిమెంట్ రోడ్డుకు మరమ్మతులు
నెలరోజుల్లోనే అధ్వానం
ౖపైపె పూతలతో సరి
మరలా రోడ్డు నిర్మాణం
నూజివీడులో రాజకీయ చర్చ
సిమెంట్ రోడ్డు ఉపరితలం లేచిపోయి కంకర బయట పడుతున్నందున సంబంధిత కాంట్రాక్టు కంపెనీనే మరలా ఇనుప ఊసలతో మూస కట్టి మూడంగుళాల మందంతో కాంక్రీటు వేసే పనులను చేపట్టింది. గతంలో చేసిన పనికి తాము ఒక్క రూపాయి కూడా బిల్లు చెల్లించలేదు.
– బాబూరావు, ఆర్‌అండ్‌బీ డీఈ, నూజివీడు


