ప్రాణాలైనా అర్పిస్తాం.. మా భూములు ఇవ్వలేం
దోపిడీ కోసమే నేవీ డిపో : బాలరాజు, మాజీ ఎమ్మెల్యే
కొయ్యలగూడెం: ప్రాణాలైనా అర్పిస్తాం.. పుడమి తల్లిని వదులుకోం.. అంటూ పోలవరం, గోపాలపురం నియోజకవర్గాల రైతులు గళమెత్తారు. నేవీ ఆయుధ డిపో పేరుతో బలవంతపు భూసేకరణ ఆపాలని డిమాండ్ చేస్తూ గురువారం ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో మండలంలోని బోడిగూడెం, మంగపతిదేవిపేట, బర్కెట్‌నగర్, రేగులగుంట, ఊట్లగూడెం, త్రినాథపురం గ్రామాల రైతులు, రైతు కూలీలు, మహిళలు, ప్రజలు కొయ్యలగూడెంలో కదం తొక్కారు. తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. మెయిన్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేశారు. ఆయుధ డిపోను అడ్డుకుంటే అరెస్టుల పర్వం కొనసాగుతుందన్న ఏలూరు ఎంపీ మహేష్‌యాదవ్ మాటలను ఖండిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బోడిగూడెం నుంచి కొయ్యలగూడెం వరకు సుమారు ఆరు కిలోమీటర్ల మేర ర్యాలీ జరిగింది. వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు పనులు కోసం తమ భూములను లాక్కోవద్దని, తమ జీవితాలను బలిపెట్టవద్దని నినదించారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే మూడుచోట్ల తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్న ఆయుధ డిపోను కొయ్యలగూడెం మండలంలో ఏర్పాటు చేస్తామనడంపై రైతుల్లో అను మానాలు నెలకొన్నాయి.
తక్షణమే నిలుపుదల చేయాలి
ఆయుధ డిపో నిర్మాణానికి 1,200 ఎకరాల భూసేకరణ కోసం చేస్తున్న ప్రయత్నాలు తక్షణమే నిలుపుదల చేయాలని రైతులు డిమాండ్ చేశారు. పొగాకు, ఆయిల్‌పామ్, మొక్కజొన్న, అరటి, కూరగాయలు, కోకో, కొబ్బరి, నిమ్మ వంటి పంటలు పండే సారవంతమైన భూములను నాశనం చేయడం తగదన్నారు. 2013 భూసేకరణ చట్టానికి విరుద్ధంగా ప్రజాప్రతినిధులు, అధికారులు వ్యవహరించడం అన్యాయమన్నారు. ఇప్పుడిప్పుడే పంట భూములు పూర్తిస్థాయిలో సాగులోకి వచ్చాయని, ఫలసాయం పొందే సమయంలో రైతుల పొట్టకొట్టడం తగదన్నా రు. భూసేకరణపై ఏలూరు ఎంపీ అసత్య ప్రచారం చే స్తున్నారని, తాము ఎక్కడ అంగీకరించామో ని రూపించాలని డిమాండ్ చేశారు. సర్వే పేరుతో తమ భూముల్లోకి వస్తే ఆత్మార్పణ చేసుకుంటామని అల్టిమేటం ఇచ్చారు. అనంతరం తహసీల్దార్‌కి వినతిపత్రం అందించారు. తహసీల్దార్ ఎన్.నాగరాజు మాట్లాడుతూ బలవంతంగా భూసేకరణ చేయమని, గ్రామసభ నిర్వహించిన తర్వాతే ముందుకు వెళతామని హామీ ఇవ్వడం ఆందోళన విరమించారు. రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.శ్రీనివాస్, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం.కృష్ణ చైతన్య, సీపీఐ, సీపీఎం మండల కన్వీనర్లు తాడిగడప ఆంజనేయరాజు, శుక్లబోయిన రాంబాబు, చలసాని కిషోర్, ఆతుకూరి వీర్రాజు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.
కొయ్యలగూడెంలో కదం తొక్కిన రైతులు
నేవీ ఆయుధ డిపో నిర్మాణం కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టడం కోసమే అని వైఎస్సార్‌సీపీ కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. ఆయన మాట్లాడుతూ వేలాది మంది రైతులను కడుపు కొట్టేలా భూదోపిడీకి కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. రెండు పంటలు పండుతూ సస్యశ్యామలంగా ఉన్న భూములను నేవీ డిపోకి ఎంపిక చేయడం రైతులకు తీవ్ర అన్యాయం చేయడమే అన్నారు. ఇక్కడ నేవీ డిపో ఏర్పాటుపై ఎంపీ మహేష్ యాదవ్ అత్యుత్సాహం కనబర్చడం అనుమానాలకు తావిస్తోందన్నారు. తక్షణమే ఆయుధం నిర్మాణ ప్రతిపాదన విరమించుకోవాలని లేదంటే రైతులకు మద్దతుగా ప్రజాస్వామ్యవాద పార్టీలు అంతా ఏకం కావాల్సి ఉంటుందని బాలరాజు హెచ్చరించారు.
ప్రాణాలైనా అర్పిస్తాం.. మా భూములు ఇవ్వలేం


