బైపాస్‌ రోడ్డు కల నెరవేరేనా? | - | Sakshi
Sakshi News home page

బైపాస్‌ రోడ్డు కల నెరవేరేనా?

Jan 29 2026 6:16 AM | Updated on Jan 29 2026 6:16 AM

బైపాస

బైపాస్‌ రోడ్డు కల నెరవేరేనా?

19 నెలలు గడిచినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే

నిర్మాణ పనులు చేపట్టాలి

రైతులకు లాభమే

నూజివీడు: నిత్యం ట్రాఫిక్‌ సమస్యతో సతమతమవుతున్న పట్టణ ప్రజల అసౌకర్యాన్ని తొలగించేందుకు రెవెన్యూ డివిజన్‌ కేంద్రమైన నూజివీడుకు గత ప్రభుత్వంలో మంజూరైన బైపాస్‌ రోడ్డు నిర్మాణం ఎప్పుడు ప్రారంభమవుతుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. పట్టణానికి మైలవరం రోడ్డు నుంచి విస్సన్నపేట రోడ్డు వరకు బైపాస్‌ రోడ్డు నిర్మాణానికి గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం రూ.25 కోట్లు మంజూరు చేసింది. దీంతో బైపాస్‌ రోడ్డు నిర్మాణం జరిగితే ట్రాఫిక్‌ కష్టాలు చాలా వరకు తీరిపోతాయని పట్టణ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ బైపాస్‌ రోడ్డు ట్రిపుల్‌ ఐటీ వెనుక భాగం నుంచి గొడుగువారిగూడెం మీదుగా పెద్దచెరువు కళంగి పైభాగాన విస్సన్నపేట రోడ్డుకు కలుస్తుంది. ఈ బైపాస్‌ రోడ్డు నిర్మాణానికి దాదాపు 22.50 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉండగా, దీనికి సంబంధించి ప్రభుత్వం భూసేకరణ నోటిఫికేషన్‌ను సైతం విడుదల చేసింది. భూ యజమానులు సైతం బైపాస్‌ రోడ్డు నిర్మాణానికి తమ భూమిని ఇవ్వడానికి అప్పట్లోనే అంగీకరించారు.

4.30 కిలోమీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పుతో నిర్మాణం

బైపాస్‌ రోడ్డును మైలవరం రోడ్డు వద్ద నుంచి విస్సన్నపేట రోడ్డు వరకు గొడుగువారిగూడెం ఎగువ భాగం మీదుగా నిర్మించనున్నారు. రోడ్డు పొడవు మొత్తం 4.30 కిలోమీటర్లు కాగా, వెడల్పు 10 మీటర్లు (33అడుగులు). ఈ మార్గంలో బిల్లుడు వాగుపై వంతెనను నిర్మించడంతో పాటు మరో రెండు శ్లాబ్‌ కల్వర్టులను సైతం నిర్మిస్తారు. బైపాస్‌ రోడ్డుకు అవసరమైన భూమిని సేకరించేందుకు గాను అప్పటి ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు ప్రత్యేక చొరవ తీసుకొని భూముల యజమానులతో నిరంతరం చర్చిస్తూ అభివృద్ధికి సహకరించాలని కోరుతూ భూమిని ఇచ్చేలా అంగీకరింపజేశారు.

రోడ్డు నిర్మిస్తే ట్రాఫిక్‌ కష్టాలకు తెరపడినట్లే

ఇబ్రహీంపట్నం, కొండపల్లి, జీ కొండూరు, గంపలగూడెం మండలం వినగడప ప్రాంతాల్లో ఉన్న స్టోన్‌క్రషర్ల నుంచి కంకర లారీలు నిత్యం నూజివీడు మీదుగా ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాకు రాకపోకలు సాగిస్తుంటాయి. 40 టన్నుల నుంచి 60 టన్నుల లోడుతో భారీ వాహనాలు పట్టణంలోకి వస్తుండటంతో నిత్యం ట్రాఫిక్‌ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో బైపాస్‌ రోడ్డు నిర్మాణం పూర్తయినట్లయితే నూజివీడు పట్టణానికి ట్రాఫిక్‌ కష్టాలు తీరతాయని భావించారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పాటై 19 నెలలు గడిచినా బైపాస్‌రోడ్డు నిర్మాణానికి సంబంధించి ఒక్క అడుగు కూడా ఇంత వరకు ముందుకు పడలేదు. ఈ నేపథ్యంలో బైపాస్‌ రోడ్డు నిర్మాణాన్ని త్వరితగతిన చేపట్టి పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

బైపాస్‌ రోడ్డు నిర్మాణం నిమిత్తం భూమిని సేకరించే పనులు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో శరవేగంగా జరుగుతున్న తరుణంలో ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడంతో బైపాస్‌ రోడ్డు నిర్మాణ పనులు నిలిచిపోయాయి. మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ కేంద్రమైనప్పటికీ ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు గడిచినా బైపాస్‌ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన పనులు ఎక్కడి గొంగళి అక్కడే అన్న చందంగా నిలిచిపోయాయి. ఎంతో శ్రమించి భూములను ఇవ్వడానికి రైతులందరినీ ఒప్పించినప్పటికీ ప్రస్తుత పాలకులు మాత్రం రోడ్డు నిర్మాణం విషయమై పట్టించుకున్న దాఖలాలే కనిపించడం లేదని అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

బైపాస్‌ రోడ్డు పనులు చేపట్టి పూర్తి చేస్తే పట్టణ ప్రజలకు ట్రాఫిక్‌ కష్టాలు తీరతాయి. మైలవరం, గంపలగూడెం వైపు నుంచి వచ్చే హనుమాన్‌ జంక్షన్‌ వైపు నుంచి వెళ్లే వాహనదారులకు సౌకర్యవంతంగా ఉంటుంది. భారీ వాహనాలు పట్టణంలోనికి రాకుండా ఉంటాయి.

– జీ రాజు, సీపీఎం నాయకుడు, నూజివీడు

బైపాస్‌ రోడ్డు నిర్మిస్తే పట్టణంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు తొలగడమే కాకుండా, రైతులకు కూడా ఎంతో లాభం చేకూరుతుంది. మామిడి తోటల్లోకి వెళ్లి రావడానికి, వ్యవసాయ దిగుబడులను సులువుగా మార్కెట్‌కు తెచ్చుకోవడానికి వీలవుతుంది. అంతేగాకుండా బైపాస్‌ రోడ్డు వెంబడి ఉండే రైతుల భూముల ధరలు సైతం పెరుగుతాయి.

– షేక్‌ మస్తాన్‌వలీ, నూజివీడు

గత ప్రభుత్వంలోనే నూజివీడు బైపాస్‌కురూ.25 కోట్లు మంజూరు

భూములిచ్చేందుకు రైతులు సైతం అంగీకారం

పట్టించుకోని ప్రస్తుత పాలకులు

బైపాస్‌ రోడ్డు కల నెరవేరేనా?1
1/3

బైపాస్‌ రోడ్డు కల నెరవేరేనా?

బైపాస్‌ రోడ్డు కల నెరవేరేనా?2
2/3

బైపాస్‌ రోడ్డు కల నెరవేరేనా?

బైపాస్‌ రోడ్డు కల నెరవేరేనా?3
3/3

బైపాస్‌ రోడ్డు కల నెరవేరేనా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement