యథేచ్ఛగా కలప అక్రమ రవాణా
బుట్టాయగూడెం: కలప అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. అటవీశాఖ అధికారులు ఎప్పుటికప్పుడు దాడులు జరిపి కలపను తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నా కలప అక్రమ రవాణా ఆగడం లేదు. ప్రస్తుతం వర్జీనియా పొగాకు క్యూరింగ్ పనులు ప్రారంభం కావడంతో పొగాకు బేరన్‌లకు కూడా అడవిలోని కలపను నరికి యథేచ్ఛగా తరలిస్తున్నారు. అటవీశాఖ అధికారుల కంట పడకుండా ఈ చీకటి వ్యాపారం జోరుగా సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల బుట్టాయగూడెం మండలం రాజానగరంలో, దండిపూడి సమీపంలో అడవిలో కలపను నరికి ట్రాక్టర్‌లపై తరలిస్తుండగా కన్నాపురం రేంజ్ అధికారి భాను ప్రకాష్ ఆధ్వర్యంలో పట్టుకుని కలప ట్రాక్టర్‌లను కార్యాలయానికి తరలించారు. అదేవిధంగా రెడ్డిగణపవరం సమీపంలో కూడా ట్రాక్టర్‌లో కలప తరలిస్తుండగా ములగలంపల్లి బీట్ ఆఫీసర్ కుర్స రాంబాబు పట్టుకుని జంగారెడ్డిగూడెం అటవీశాఖ కార్యాలయానికి తరలించారు. కాగా రాత్రి వేళల్లో కొందరు వ్యక్తులు ట్రాక్టర్‌లలో కలపను గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తున్నారు. బుట్టాయగూడెం మండలం వీరన్నపాలెం సమీపంలో చింతలపూడి ఎత్తిపోతల పథకం కాల్వ వద్ద తరలించేందుకు అడవిలో నుంచి నరికిన కలపను సిద్ధంగా ఉంచి భద్రపరచి ఉంచారు. అయితే ఇది ఎవరు, ఎందుకు అక్కడ ఉంచారో తెలియాల్సి ఉంది. ఫారెస్ట్ అధికారులు గట్టి నిఘా ఏర్పాటు చేసి కలప అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు.
యథేచ్ఛగా కలప అక్రమ రవాణా


