కన్నాపురం సమీపంలో అక్రమ తవ్వకాలు
కొయ్యలగూడెం: పుడమి తల్లికి అక్రమార్కులు చిచ్చు పెడుతున్నారు. కన్నాపురం సమీపంలో గతకొద్ది రోజుల నుంచి సాగునీటి చెరువులో మట్టిని యథేచ్ఛగా తరలిస్తున్నారు. జెడ్పీ హైస్కూల్‌కు వెనుక ఉన్న చెరువులో అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి జేసీబీని ఏర్పాటు చేసి ట్రక్కుల్లో తరలిస్తున్నాడు. రాత్రి వేళల్లో కొనసాగుతున్న మట్టి తరలింపు అడ్డుకోవడంలో ఇరిగేషన్ శాఖ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని రైతులు ఆరోపిస్తున్నారు. అక్రమ మట్టి తోలకాలు నిరోధించాల్సిన ప్రభుత్వ శాఖలోని అధికారులు పట్టించుకోవడం లేదు. పులి సంచరిస్తున్న ప్రదేశం వద్దనే చెరువులలోని మట్టి తోలకాలు చేస్తున్నారని రైతులు చెబుతున్నారు. సరిహద్దులను దాటించి టిప్పర్లు, ట్రక్కులలో మట్టిని తరలిస్తున్నారు. రావిగూడెం సమీపంలోని దిప్పకాయలపాడు గ్రామానికి చెందిన జేసీబీ, టిప్పర్లు కలిగిన వ్యక్తులు కొద్ది రోజుల నుంచి కాలువ గట్టు మట్టిని కొయ్యలగూడెం మండలంలోని పలు గ్రామాలకు తరలిస్తున్నారని గిరిజనులు ఆరోపించారు.


