దివ్య తేజోమయ.. ధన్యోస్మి | - | Sakshi
Sakshi News home page

దివ్య తేజోమయ.. ధన్యోస్మి

Jan 26 2026 4:53 AM | Updated on Jan 26 2026 4:53 AM

దివ్య

దివ్య తేజోమయ.. ధన్యోస్మి

సూర్య, చంద్ర ప్రభ వాహనాలపై మెరిసిన శ్రీవారు

చిన వెంకన్న ఆలయంలో వైభవంగా రథసప్తమి వేడుకలు

ద్వారకాతిరుమల: చిన్న తిరుపతిగా పేరొందిన ద్వారకాతిరుమల దివ్య క్షేత్రంలో రథసప్తమి వేడుకలు ఆదివారం కన్నులపండువగా జరిగాయి. సూర్య జయంతిని పురస్కరించుకుని శ్రీవారు ఉదయం సూర్య ప్రభ, రాత్రి చంద్ర ప్రభ వాహనాలపై తిరువీధుల్లో విహరిస్తూ భక్తకోటికి కనువిందు చేశారు. తేజోవిరాజితుడైన స్వామివారి దివ్య మంగళ స్వరూపాన్ని వీక్షించిన భక్తులు పునీతమయ్యారు. ఉదయం ఆలయంలో శ్రీవారు, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను సూర్య ప్రభ వాహనంపై ఉంచి అర్చకులు ప్రత్యేక పుష్పాలంకారాలు చేశారు. ఆ తరువాత విశేష పూజాధికాలు నిర్వహించి, హారతులిచ్చారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛరణల నడుమ స్వామివారి వాహనం ప్రధాన రాజగోపురం మీదుగా తిరువీధులకు పయనమయ్యింది. అశ్వ, గజ సేవలు, కోలాట నృత్యాల నడుమ తిరువీధుల్లో సూర్యప్రభ వాహనంపై దేదీప్యమానంగా వెలుగొందిన స్వామి, అమ్మవార్లను భక్తులు దర్శించి, తరించారు. ఈ వాహనంపై ఉన్న స్వామివారిని దర్శిస్తే సూర్యదేవుని అనుగ్రహంతో సకల విద్యా, ఆరోగ్య, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు తెలిపారు. అలాగే రాత్రి చంద్ర ప్రభ వాహనంపై స్వామివారి తిరువీధి సేవ క్షేత్రంలో నేత్రపర్వంగా జరిగింది. చంద్ర కిరణాల వెలుగుల్లో, చల్లని గాలుల నడుమ అట్టహాసంగా తిరువీధుల్లో దర్శనమిచ్చిన శ్రీవారు, అమ్మవార్లను అధిక సంఖ్యలో భక్తులు దర్శించి, పరవశించారు. ఉత్సవ ఏర్పాట్లను ఆలయ ఏఈఓ పి.నటరాజారావు, సూపరింటెండెంట్‌ దుర్గాప్రసాద్‌ పర్యవేక్షించారు.

దివ్య తేజోమయ.. ధన్యోస్మి 1
1/1

దివ్య తేజోమయ.. ధన్యోస్మి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement