బ్యాంకు ఉద్యోగుల సమ్మె బాట
ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలి
ఐదు రోజుల పనిదినాలు కల్పించాలి
బ్యాంకులను ప్రైవేటీకరణ చేయవద్దని డిమాండ్
ఏలూరు (టూటౌన్): అపరిష్కృతంగా ఉన్న బ్యాంకు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఉద్యోగులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే బ్యాంకుల వద్ద ధర్నాలు, నిరసన ర్యాలీలు నిర్వహించిన ఉద్యోగులు తాజాగా ఈ నెల 27న దేశవ్యాప్తం సమ్మెకు దిగుతున్నారు. ఈ సమ్మెలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా 252 జాతీయ బ్యాంకు శాఖల పరిధిలో 1,500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరంతా సమ్మెలో పూర్తి స్థాయిలో దిగుతున్నారు. గత రెండు, మూడు సంవత్సరాలుగా అనేక జాతీయ బ్యాంకుల్ని విలీనం చేశారు. దీనిపై ఉద్యోగులు ఆగ్రహంగా ఉన్నారు.
రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీ
జాతీయ బ్యాంకుల్లో సుమారు రెండు లక్షల పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేయకుండా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని యూనియన్ నాయకులు ఆరోపిస్తున్నారు. దీంతో పని భారం పెరిగిందని వాపోతున్నారు. వారానికి ఐదు రోజులు పని కల్పిస్తామని భారత బ్యాంకుల అసోసియేషన్‌కు హామీ ఇచ్చి సంవత్సరాలు గడుస్తున్నా, అమలు చేయకుండా తాత్సారం చేస్తున్నారని యూనియన్ నాయకులు గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వారానికి ఐదు రోజులు పని దినాలు కల్పించాలని కోరుతూ జనవరి 27న దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో..
ఉమ్మడి జిల్లాలో గతంలో 28 రకాల జాతీయ బ్యాంకులు ఉండగా ప్రస్తుతం వీటి సంఖ్య 25కు తగ్గింది. ఆయా బ్యాంకుల పరిధిలో సుమారు 252 శాఖలు ఉన్నాయి. రోజూ సుమారు రూ.400 కోట్ల లావాదేవీలు జరుగుతుంటాయి. ఆయా బ్యాంకుల్లో సుమారు 1,500 మంది వరకు ఉద్యోగులు పనిచేస్తున్నారు.
దేశ వ్యాప్తంగా అన్ని జాతీయ బ్యాంకుల్లో కలిపి 2 లక్షల మేరకు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. తక్షణం ఖాళీలను భర్తీ చేయాలి. కార్పొరేట్ సంస్థలు, వ్యక్తులకు బ్యాంకుల ద్వారా ఇచ్చిన రుణాలను తక్షణం వసూలు చేసేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఈ నెల 27న జరిగే దేశవ్యాప్త బ్యాంకుల సమ్మెకు ప్రజలు సంపూర్ణ మద్దతు ఇవ్వాలి.
– దుగ్గిరాల శ్రీనివాస మోహన్, అధ్యక్షుడు, యూఎఫ్‌బీయూ, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా
గతంలో భారత బ్యాంకుల అసోసియేషన్‌తో చేసుకున్న ఒప్పందం మేరకు వారానికి ఐదు పనిదినాలు చేయాలి. బ్యాంకుల ప్రైవేటీకరణ తక్షణం నిలుపుదల చేయాలి. పేదలు, రైతులు, వ్యాపారులకు బ్యాంకులు ఎంతో మేరకు సేవ చేస్తున్నాయి. అలాంటి సేవలను దూరం చేసేలా ప్రభుత్వం బ్యాంకులను ప్రైవేటీకరణ చేయడం దారుణం.
– కాలే శ్రీనివాసరావు, కన్వీనర్, యూఎఫ్‌బీయూ
బ్యాంకు ఉద్యోగుల సమ్మె బాట
బ్యాంకు ఉద్యోగుల సమ్మె బాట


