గణతంత్ర వేడుకల్లో శ్రీనిజ ప్రదర్శన
గణపవరం: పిప్పరకు చెందిన శ్రీనిజకు ఈనెల 26న ఢిల్లీలో నిర్వహించే భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనే అవకాశం దక్కింది. ఇతర కళాకారులతో కలిసి భరతనాట్యం ప్రదర్శించనుంది. ఆమె ప్రస్తుతం ఎన్వీడియా కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిగా పనిచేస్తున్నారు. విద్యార్థి దశ నుంచే భరతనాట్యంపై మక్కువతో నేర్చుకుని అనేక ప్రదర్శనలిచ్చి ప్రశంసలందుకుంది.
నూజివీడు: మండలంలోని కొత్తరావిచర్ల సర్పంచి కాపా శ్రీనివాసరావుకు రిపబ్లిక్ దినోత్సవ వేడుకల్లో పాల్గొనాలని కేంద్రం నుంచి ఆహ్వానం అందింది. ఉత్తమ పంచాయతీగా కొత్త రావిచర్ల, ఉత్తమ సర్పంచిగా కాపా శ్రీనివాసరావు ఎంపిక కావడంతో ఆయనకు అరుదైన గౌరవం దక్కింది. దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో నిర్వహించే 77వ రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనాలని అధికారికంగా ఆహ్వానం అందింది. దీంతో ఆయనకు పలువురు అధికారులు, రాజకీయ నాయకులు అభినందనలు తెలిపారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రాష్ట్రంలో సహకార సంఘాల్లో పని చేస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 27 నుంచి గుంటూరులోని సహకార శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేస్తూ వంటా వార్పు కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు జిల్లా సహకార సంఘాల ఉద్యోగుల జేఏసీ అధ్యక్షుడు కేవీవీ సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి పీ.సుబ్బారావు, కోశాధికారి జీ.వీరయ్య ప్రకటనలో తెలిపారు. వంటావార్పు కార్యక్రమాలు జిల్లాల వారీగా ఏఏ తేదీల్లో నిర్వహించాలో రాష్ట్ర జేఏసీ షెడ్యూల్ ప్రకటించిందని తెలిపారు. వచ్చే నెల 4న పశ్చిమగోదావరి జిల్లాలో వంటావార్పు నిర్వహిస్తామని, 13న రాష్ట్రవ్యాప్తంగా సహకార సంఘాల ఉద్యోగులందరూ గుంటూరులో కమిషనర్ ఆఫీసు ముట్టడి కార్యక్రమంలో పాల్గొంటారని స్పష్టం చేశారు.
చింతలపూడి: చింతలపూడి మండలంలో అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి, గ్రావెల్ తరలిస్తున్న ట్రాక్టర్లను ఆదివారం రెవెన్యూ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన ట్రాక్టర్ యజమానులు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలోని ఏలూరు–చింతలపూడి ప్రధాన రహదారిపై ట్రాక్టర్లను అడ్డుగా నిలిపి నిరసన తెలిపారు. తమను మట్టి తోలుకోనివ్వకపోతే ఉపాధి కోల్పోతామని అధికారులను నిలదీశారు. రోడ్డుపై వాహనాలు నిలిచిపోవడంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చింతలపూడి పోలీసులు వెంటనే రంగప్రవేశం చేసి ఆందోళనకారులతో చర్చలు జరిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మట్టి, గ్రావెల్ తరలింపునకు ముందస్తు అనుమతులు తప్పనిసరి అని, అనుమతి పత్రాలు పొందిన తర్వాతే తోలకాలు చేపట్టాలని ఎస్‌ఐ కె సతీష్ కుమార్ స్పష్టం చేశారు. పోలీసులు నచ్చజెప్పడంతో ట్రాక్టర్ యజమానులు ఆందోళన విరమించి అక్కడి నుండి వెనుదిరిగారు.
భీమవరం: ఆంధ్ర ప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా నూతన కార్యవర్గాన్ని తాడేపల్లిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని జిల్లా అధ్యక్షుడు జి.ప్రకాశం తెలిపారు. ఈ కమిటీలో జిల్లా గౌరవ అధ్యక్షుడిగా పి.ఎన్.వి.ప్రసాద్, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా జి.ప్రకాశం, బి.వి. నారాయణ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా కె.రాంబాబు, ఎల్.రాజు, జి. ప్రసన్న కుమార్, ఎం.శ్రీలక్ష్మి, కార్యదర్శులుగా పి.జనార్దన స్వామి, వి.రామ్‌మోహన్, ఎం.విజయ్ బాబు, పి.వి.రాఘవులు, ఏ.వీరభద్ర రావు, ఆడిట్ కమిటీ కన్వీనర్‌గా ఎస్.ఎస్.జాన్సన్, సభ్యులుగా ఎం.పుష్పరాజు, జి.దేవదాస్, వై.ఏడు కొండలు, రాష్ట్ర కౌన్సిలర్‌గా సీహెచ్ సత్యనారాయణ ఎన్నికయ్యారని తెలిపారు.
గణతంత్ర వేడుకల్లో శ్రీనిజ ప్రదర్శన
గణతంత్ర వేడుకల్లో శ్రీనిజ ప్రదర్శన


