ఆయుధ డిపోని అడ్డుకుంటాం
కొయ్యలగూడెం: మండలంలో నేవీ ఆయుధ డిపో ఏర్పాటు అడ్డుకుంటామంటూ పోలవరం, గోపాలపురం నియోజకవర్గాలకు చెందిన రైతులు ప్రభుత్వాలకు హెచ్చరికలు జారీ చేశారు. ఆదివారం బోడిగూడెం గ్రామంలో సమావేశంలో పాల్గొని నేవీ డిపో ఏర్పాటుపై వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఎంపీ పుట్టా మహేష్ నేవీ డిపో ఏర్పాటుపై అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని గ్రామ సభలు నిర్వహించకుండా పంచాయతీల తీర్మానం చేయకుండా డిపో ఏర్పాటుపై ప్రకటనలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టు పనులు దక్కించుకోవడం కోసం దళారుల వ్యవస్థ తయారయిందని దీంతో ఎంపీకి తప్పుడు సమాచారం అందించారని రైతులు ఆరోపించారు. నూటికి 10 మంది రైతులు కూడా నేవీ ఆయుధ డిపోకు సుముఖంగా లేరన్నారు. ఈ సందర్భంగా భూములు కోల్పోతున్న రైతులు మాట్లాడుతూ 24న కొయ్యలగూడెం పర్యటనకు వచ్చిన ఎంపీ 90 శాతం రైతులు భూములు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారని 10 శాతం మాత్రమే సిద్ధంగా లేరని అనడాన్ని రైతులు ఖండించారు. బోడిగూడెం, మంగపతిదేవిపేట, రేగులగుంట, ఊట్లగూడెం, బర్కెట్‌నగర్ గ్రామాలలో ఏ విధమైన గ్రామ సభలు, అవగాహన సదస్సు నిర్వహించకుండా నేవీ డిపో ఏర్పాటుకు రైతుల అభిప్రాయం ఎలా తెలుస్తుందని అన్నారు. కార్యక్రమంలో జక్కు పెద్ద వెంకన్న, ఆవూరి గంగరాజు, మోసం దుర్గారావు, ఇళ్ల శ్రీరామమూర్తి తదితరులు పాల్గొన్నారు.


