దినకరా.. శుభకరా
● ఘనంగా రథసప్తమి వేడుకలు
● వైభవంగా సూర్యభగవానుడి కల్యాణ వేడుకలు
తణుకు అర్బన్: రథసప్తమి సందర్భంగా తణుకులో సూర్యభగవానుడి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఈ ఏడాది స్వామివారికి ప్రీతికరమైన రోజు ఆదివారం రావడంతో భక్తులు తెల్లవారుజాము నుంచే ఆలయం వద్ద క్యూకట్టారు. జిల్లాతోపాటు ఇతర జిల్లాల నుంచి సైతం భక్తులు అధికసంఖ్యలో తరలిరావడంతో తణుకు పట్టణ ప్రాంతమంతా రద్దీగా మారింది. తెల్లవారుజాము 1 గంట నుంచే భక్తులు క్యూలైన్‌లో ఉన్నారు. ముందుగా ఉదయం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించిన అనంతరం సుందరంగా అలంకరించారు. ప్రసిద్ధిగాంచిన ఆలయం కావడంతో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని పూలతో ప్రత్యేకంగా అలంకరించారు.
కన్నులపండువగా కల్యాణం
దేవాదాయ ధర్మాదాయ శాఖ, ఆలయ ధర్మకర్తల మండలి పెద్దల ఆధ్వర్యంలో ఉషా, పద్మిని, ఛాయ, సౌంజ్ఞ సమేత శ్రీసూర్యనారాయణస్వామి కల్యాణాన్ని స్వామివారి కల్యాణ మండపంలో ఉదయం 11.30 గంటల ముహూర్తానికి వేదపండితుల వేదమంత్రోచ్ఛరణల మధ్య కన్నుల పండువగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ గమిని రాము దంపతులు పీటలపై కూర్చుని స్వామివారి కల్యాణ ఘట్టాన్ని జరిపించారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు స్వామి, అమ్మవార్ల రథోత్సవాన్ని పురవీధుల్లో నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు స్వామివారికి పుష్పయాగం చేశారు. సుమారుగా 60 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ ఈవో ముత్యాల సత్యనారాయణ తెలిపారు. తణుకు పోలీసు అధికారులు తమ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటుచేశారు. స్వామివారి దర్శనం, కల్యాణ ఘట్టాన్ని వీక్షించిన వారందరికీ అన్నసమారాధాన నిర్వహించారు. సూర్యభగవానుడి కల్యాణం సందర్భంగా తణుకు సూర్యదేవాలయానికి వచ్చిన భక్తుల తాకిడికి తణుకు సూర్యాలయం వీధితోపాటు రాష్ట్రపతి రోడ్డు, పిండిమర్ల వీధి, బాబువారి వీధితోపాటు తణుకు ప్రాంతమంతా భక్తులతో కిక్కిరిసిపోయింది.
దినకరా.. శుభకరా


